ఏళ్లుగా దారి కోసం నిరీక్షణ.. సమస్యల వలయంలో తెనుగుపల్లె గ్రామం

by Batti.Sumithra |

మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని చిన్నగుడిపేట గ్రామం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.

ఏళ్లుగా దారి కోసం నిరీక్షణ.. సమస్యల వలయంలో తెనుగుపల్లె గ్రామం
X

దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని చిన్నగుడిపేట గ్రామం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. 60 ఏళ్లుగా దారి కోసం నిరీక్షణలో మగ్గుతోంది. పాలకుల పనితీరు కారణంగా అభివృద్ధికి నోచుకోక ఆమడ దూరంలో ఉంది. ఓట్లేమో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంటే.. మండలమేమో మరో జిల్లా పరిధిలో ఉండడమే ప్రధాన కారణం. రెండు జిల్లాలకు చెందిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల మధ్య చిన్నగుడిపేట అభివృద్ధి తెప్ప తగలేసారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు నిజంగానే చదువు 'కొనాల్సి' వస్తోంది. పాఠశాల, కళాశాలకు వెళ్లాలంటే ఆటోలకు వందేసి రూపాయలు ఖర్చు చేస్తున్న తీరే ప్రత్యక్ష నిదర్శనం. కొన్నేళ్లుగా అభివృద్ధికి నోచుకోక అష్టకష్టాలు పడుతున్న ఆ పల్లెలో గూడు కట్టుకున్న ఆవేదన అంతా ఇంకా కాదు.

మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని చిన్నగుడిపేట గ్రామ జనాభా 2,200. వీరిలో ఓటర్లు 1,465 మంది ఉన్నారు. కురుమవాడ, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, జెండావాడ, లంబాడి తండాలను కలగలుపుకుని ఉన్న ఈ పల్లె, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన జిల్లాల విభజనలో మంచిర్యాల జిల్లా పరిధిలోకి వెళ్లింది. అయితే ఓట్లను కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ శాసనసభకు కేటాయించారు. అప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు పడకేశాయి. హామీలు ఇచ్చిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితమయ్యారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ఒక్కరోజైనా చిన్నగుడిపేట గ్రామస్తుల సమస్యలను ఎమ్మెల్యేలు పట్టించుకోలేదంటే అభివృద్ధి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

'గడ్డం'ది ఊరు.. 'పాల్వాయి'కి ఓట్లు..

చిన్నగుడిపేట భీమిని మండలం మంచిర్యాల జిల్లాలోకి వస్తే, గ్రామానికి సంబంధించిన ఓట్లు మాత్రం సిర్పూర్ నియోజకవర్గం (కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా) పరిధిలో ఉన్నాయి. ఊరు బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ది అయితే, ఓట్లు సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబుకు కేటాయించడం గమనార్హం. గ్రామానికి సంబంధించిన నిధులన్నీ మంచిర్యాల జిల్లా నుంచే కేటాయిస్తున్నారు. గ్రామంలో ఏ పనులు జరగాలన్నా సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పరస్పర సమన్వయంతో చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలోని కేస్లాపూర్, చిన్న తిమ్మాపూర్ గ్రామాలను కూడా భీమిని మండలంలో కలిపారు. ఈ గ్రామాల ఓట్లు కూడా సిర్పూర్ నియోజకవర్గానికే ఉన్నాయి. రెండు ముక్కలుగా ఉన్న ఈ గ్రామాల అభివృద్ధి మాత్రం అటకెక్కిన చందంగా తయారైంది.

రోడ్డు లేక అవస్థలు..

ఇక్కడి ప్రజలు నిత్యం బెల్లంపల్లి నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే వడాల గ్రామం వరకు ఐదు కిలోమీటర్ల రోడ్డు లేక దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. అయితే 50 ఏళ్లుగా మట్టి (మెటల్) రోడ్డు మాత్రమే ఉండటంతో బురదలో వాహనాలు ఇరుక్కుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఉన్న ఆర్టీసీ బస్సు సౌకర్యం ప్రస్తుతం మంచిర్యాల డిపో నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యే చొరవతో కొంత మేర అందుబాటులోకి వచ్చినప్పటికీ, వర్షాకాలంలో బస్సులు గ్రామానికి చేరుకోలేని పరిస్థితి నెలకొంటోంది. దీంతో ఇబ్బందులు అనివార్యమవుతున్నాయని గ్రామ ప్రజలు వాపోతున్నారు. తమ గ్రామానికి శాశ్వత రహదారి నిర్మాణానికి పాలకులు ముందుకు రావాలని కోరుతున్నారు.

వర్షాకాలంలో తప్పని తిప్పలు..

ప్రతి ఏటా వర్షాకాలంలో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు సైతం గ్రామానికి వెళ్లాలంటే జంకుతున్నారు. ఏళ్లుగా రహదారి నిర్మాణం కోసం గ్రామస్తులు విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, సమస్యలతో సతమతమవుతున్నామని వాపోతున్నారు. మండల కేంద్రంలోనే ఇంటర్ కళాశాల నిర్మించాలని పలుమార్లు వినతులు సమర్పించినా ఫలితం శూన్యంగానే మిగిలిందని గ్రామస్తులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే గ్రామానికి వచ్చే బస్సు సేవలు నిలిచిపోయే పరిస్థితి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా తమ గోడు ఆలకించి గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యమైనా కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Next Story