ఉద్యోగులకు పీఆర్సీ తక్షణమే విడుదల చేయాలి: సీఎం రేవంత్ రెడ్డిని కోరిన టీఎస్ మెసా

by Batti.Sumithra |

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పీఆర్సీని తక్షణమే విడుదల చేసి వేతన సవరణ చేపట్టాలని తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (టీఎస్ మెసా) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరింది.

ఉద్యోగులకు పీఆర్సీ తక్షణమే విడుదల చేయాలి: సీఎం రేవంత్ రెడ్డిని కోరిన టీఎస్ మెసా
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పీఆర్సీని తక్షణమే విడుదల చేసి వేతన సవరణ చేపట్టాలని తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (టీఎస్ మెసా) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరింది. ఈ మేరకు టీఎస్ మెసా అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం బుధవారం సీఎంఓలో ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేసింది. అనంతరం ఫారూఖ్ అహ్మద్ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.

అయితే పీఆర్సీ విడుదలలో జరుగుతున్న జాప్యం కారణంగా ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇంటి అద్దెలు, పిల్లల విద్యా ఫీజులు, ఆస్పత్రి ఖర్చులు సైతం చెల్లించలేని దుస్థితిలో ఉద్యోగులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిషన్ నివేదిక విషయంలో ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం నెలకొందని, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలు కూడా విడుదల కాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి, పీఆర్సీ కమిషన్ నుంచి నివేదికను తక్షణమే తెప్పించుకుని, వేతన సవరణ పై స్పష్టమైన ప్రకటన చేయాలని ఫారూఖ్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు.

Next Story