రెండు నెలల్లో ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియ పూర్తి కావాలి

by Ratna Kumari |

ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంను పూర్తిచేసి రైతులకు పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఆ దిశగా అధికారులు రెండు నెలల్లో ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు ఆదేశించారు.

రెండు నెలల్లో ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియ పూర్తి కావాలి
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంను పూర్తిచేసి రైతులకు పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఆ దిశగా అధికారులు రెండు నెలల్లో ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లాలోని నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పథకాలతో పాటు మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించి ప్రైమరీ డిక్లరేషన్ పూర్తయి అవార్డు స్థాయిలో ఉన్న భూముల వివరాలను అడిగారు. అనంతరం వివిధ మండలాల వారీగా ఆయా గ్రామాల పరిధిలో చేయాల్సిన భూ సేకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రెండు నెలల్లో ప్రాజెక్ట్లకు అవసరమైన పెండింగ్ భూసేకరణను పూర్తి చేయాలని ఆదేశించినందున అందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. భూ సేకరణ పై ప్రతి వారం సమీక్ష సమావేశాలు తప్పకుండా నిర్వహిస్తామని, అధికారులు ఎప్పటికప్పుడు పురోగతి సాధిస్తూ కావాల్సిన భూసేకరణ లక్ష్యాలను సాధ్యమైనంత తొందరగా చేరుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ... రెవిన్యూ, ఇరిగేషన్, సర్వే అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించుకుని భూసేకరణ విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. ఆయా శాఖల అధికారులు ప్రత్యేక టీములుగా ఏర్పడి రోజువారి లక్ష్యాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పనిచేయాలన్నారు. భూ సేకరణ వేగవంతం కావడానికి అవసరమైతే అదనపు సర్వేయర్లను నియమిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ, సర్వే ఏడి నూకరాజు, ఇరిగేషన్ ఈఈలు సంజీవ్ ప్రసాద్, శ్రీనివాసులు, ఆయా మండలాల తహశీల్దార్లు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story