ఆనందంలో ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బంది.. ఒకటో తారీఖునే అందిన జీతాలు

by Kema Shiva Kumar |

ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు.

ఆనందంలో ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బంది.. ఒకటో తారీఖునే అందిన జీతాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జీతాల చెల్లింపు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బందికి ఈ నెల మొదటి తారీఖునే జీతాలు విడుదలయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలను జమ చేసింది. గతంలో జీతాల చెల్లింపులో ఆలస్యం వల్ల ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన సీఎం రేవంత్‌రెడ్డి, రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, ఏజెన్సీల నుంచి పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఒకటో తారీఖునే జీతాలు అందాలని ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఆదేశాల అమలులో భాగంగా ఇకపై ప్రతి నెల 25లోగా జీతాల బిల్లులను ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ విభాగాలకు సమర్పించాలని, నెల చివరి పని దినానికల్లా ఆడిట్ ప్రక్రియ పూర్తిచేయాలని ఆర్థిక శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ నెల బిల్లులు అందిన అన్ని విభాగాల ఉద్యోగులకు ఇవాళ జీతాలు జమ చేసినట్లుగా ఆర్థిక శాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి విన్నవించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story