ఢిల్లీ రావాల్సిన అనేక విమానాలు రద్దు

by Shamantha N |

మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చే, ఇక్కడి నుంచి వెళ్లే అనేక విమానాలు రద్దయ్యాయి.

ఢిల్లీ రావాల్సిన అనేక విమానాలు రద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చే, ఇక్కడి నుంచి వెళ్లే అనేక విమానాలు రద్దయ్యాయి. ఆయా మార్గాల్లో ఎయిర్ వేస్ ల మూసివేత కారణంగా ఢిల్లీ విమానాశ్రయం నుంచి వచ్చే, వెళ్లే అనేక విమానాలు రద్దయ్యాయి. మొత్తం 48 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీకి వచ్చే 28, ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన 20 విమానాలు ఉన్నాయి. ఇందులో ఎయిర్ ఇండియాకు చెందిన 17, ఇండిగోకు చెందిన 8, ఇతర విమాన సంస్థల 3 విమానాలు ఉన్నాయి. ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన 20 విమానాల్లో 10 ఎయిర్ ఇండియాకు, 7 ఇండిగోకు, మిగతా 3 ఇతర సంస్థలకు చెందినవిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యం

ఇక మంగళవారం ఉదయం ఇండిగో ‘ఎక్స్’ లో ప్రకటించిన ప్రకారం.. మిడిల్ ఈస్ట్ లోని విమానాశ్రయాలు క్రమంగా తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో, తాము జాగ్రత్తగా తిరిగి సేవలను పునరుద్ధరిస్తున్నామని తెలిపింది. ప్రయాణికుల భద్రతకే అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అందుబాటులో ఉన్న సురక్షిత మార్గాల ద్వారా సేవలు అందిస్తామని తెలిపింది. స్పైస్‌జెట్, అకాసా ఎయిర్ సంస్థలు కూడా తమ విమానాలపై ప్రభావం పడొచ్చని పేర్కొన్నాయి. మంగ‌ళ‌వారం ఉదయం ఖతార్‌లోని దోహాలో ఉన్న అమెరికా సైనిక స్థావరం ‘అల్ ఉదెయ్ద్’పై ఇరాన్ దాడికి దిగిన తర్వాత ఖతార్ తో పాటు బహ్రెయిన్ , యూఏఈ, ఇరాక్, కువైట్ దేశాలు తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయడంతో విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. కాగా ఇరాన్ తాజాగా కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్లు పేర్కొనడంతో మరిన్ని విమానాలు నడిచే అవకాశం ఉంది.

Next Story