హార్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌పై ప్రభావం..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-01 14:18:58  IST  )

ఇరాన్, యూఏఈ దాడుల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి మూసివేత ప్రభావం భారత్‌పై పడే అవకాశం ఉంటుందని పలువురు నిపుణులు అంటున్నారు

హార్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌పై ప్రభావం..?
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్(Iran), యూఏఈ(UAE) దాడుల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి మూసివేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభావం భారత్‌పై పడే అవకాశం ఉంటుందని పలువురు నిపుణులు అంటున్నారు. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు రవాణా జరుగుతోంది. సౌదీ అరేబియా, ఇరాక్, యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ప్రధాన ఆయిల్ ఉత్పత్తి దేశాలను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో ఈ జలసంధి కలుపుతుంది. ఈ మార్గం ద్వారా ప్రతి రోజూ లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఇతర దేశాలకు ఎగుమతి జరుగుతుంటుంది. ఇలాంటి కీలకమైన మార్గాన్ని ఇరాన్ మూసివేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందని, తద్వారా ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదేగాని జరిగితే భారత్‌పై కూడా ప్రభావం పడుతుందని అంటున్నారు. అమెరికాకు మద్దతు ఇచ్చే దేశాలపైనా అటు ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో హార్మూజ్ జలసంధి ద్వారా వెళ్లేందుకు ప్రయత్నించిన భారీ ఆయిల్ ట్యాంకర్ నౌకను ఇరాన్ పేల్చివేసింది.


ఇలా ఈ మార్గంలో వచ్చే ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేస్తే ఈ ప్రభావం భారత దేశంలో కూడా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆయిల్ కొరతతో ఇబ్బందులు తప్పవేమోనని, ధరలు కూడా ఆకాశాన్ని అంటుకుంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భారత్, ఇరాన్ మధ్య మంచి సంబధాలున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆయిల్ కొరత లేకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Next Story