- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడులో పోలీసు కస్టడీలో ఉన్నవ్యక్తి మృతి.. ఎస్పీ ట్రాన్స్ ఫర్
తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లాలోని 27 ఏళ్ల అజిత్ కుమార్ అనే ఆలయ సెక్యూరిటీ గార్డు కస్టడీలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లాలోని 27 ఏళ్ల అజిత్ కుమార్ అనే ఆలయ సెక్యూరిటీ గార్డు కస్టడీలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. జూన్ 27న ఒక దొంగతనం కేసులో విచారణ కోసం అజిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక రోజు తర్వాత అతను మృతిచెందాడు. దీనిపై తమిళనాడు సర్కార్, పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఐదుగురు పోలీసులను అరెస్టు చేసి, జులై 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసును క్రైమ్ బ్రాంచ్–సీసీఐడీకి బదిలీ చేశారు. ఘటనకు సంబంధించి శివగంగై జిల్లా ఎస్పీ ఆశిష్ రావత్‌ను ప్రభుత్వం బదిలీ చేసి, ఆయన స్థానంలో చండీష్‌ను నియమించింది.
అజిత్ శరీరంపై తీవ్ర గాయాలు
పోస్టుమార్టం అనంతరం అజిత్ కుమార్ శరీరంపై గాయాలున్నట్లు తేలింది. ముఖం, చెవులు, మోచేతులు, పక్కటెముకలపై తీవ్ర గాయాలు, రెండు చెవులపై రక్తపు మరకలు గాయాలు ఉన్నాయి. పోలీసుల హింస కారణంగా అతను చనిపోయాడని అజిత్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. మొదట అతను పారిపోవడానికి ప్రయత్నించి జారి పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. కానీ అజిత్ శరీరంపై గాయాలు చూస్తే అతడిని కొట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇదే తరహాలో గతంలో విఘ్నేష్ అనే వ్యక్తి కూడా కస్టడీలో మరణించాడని పలువురు గుర్తు చేస్తున్నారు.
రాజకీయంగా విమర్శలు
ఈ ఘటనపై రాజకీయపరంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రీ కజగం పార్టీ ఈ కేసును కోర్టు పర్యవేక్షణలో విచారించాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌కి పిటిషన్ దాఖలు చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) నియమించాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, మాజీ సీఎం పళనిస్వామి ఈ ఘటనపై స్పందిస్తూ, కస్టడీ మృతిపై సీబీఐ విచారణ జరపాలని, ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా ఎన్‌హెచ్‌ఆర్‌సి (NHRC) సుమోటోగా దర్యాప్తు ప్రారంభించాలంటూ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందిస్తూ, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకున్నామని నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు.






