గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తే ఇంటి పన్ను చెల్లిస్తా.. సర్పంచ్

by Batti.Sumithra |

ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి గ్రామ పంచాయతీ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.

గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తే ఇంటి పన్ను చెల్లిస్తా.. సర్పంచ్
X

దిశ, నాంపల్లి : ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి గ్రామ పంచాయతీ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి చదివించే కుటుంబాలకు ఇంటి పన్ను, నల్లా (నీటి) పన్ను బరిస్తానని సర్పంచ్ మంటిపల్లి మణిమాల అన్నారు. ప్రభుత్వ పాఠశాలల పై ప్రజల్లో మరింత నమ్మకం పెంచడం, విద్యార్థుల నమోదు శాతాన్ని గణనీయంగా పెంచడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మణిమాల మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. గ్రామంలోని ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ ఇంటి పన్ను తన వేతనం నుంచి చెల్లిస్తామని తెలియజేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా నిలవనుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Next Story