కరువును ప్రకృతి ముందే పసిగట్టిందా? నేరేడు పండ్లు చేస్తున్న హెచ్చరిక ఏంటి?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-19 12:48:47  IST  )

కరువును ప్రకృతి ముందే పసిగట్టిందా? నేరేడు పండ్లు చేస్తున్న హెచ్చరిక ఏంటి?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల్ని ఎదుర్కోక తప్పదని, తీవ్ర కరవు పరిస్థితులు రాబోతున్నాయని ఇప్పటికే భారత్, అమెరికా వాతావరణ సంస్థలు ప్రపంచాన్ని హెచ్చరించాయి. శీతాకాలంలో సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్ ఉంటుందని కూడా హెచ్చరికలు జారీచేశాయి. పంటలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్సుందని, ఫలితంగా ఆహార కరువు ఏర్పడే ప్రమాదం ఉందని కూడా పేర్కొన్నాయి. అయితే.. వాతావరణ సంస్థల కంటే ముందే ప్రకృతి నుంచి మనకు హెచ్చరిక వచ్చిందా అంటే.. అవునంటున్నారు పెద్దలు. నేరేడు పండ్లు.. జామున్ పండ్లు అని కూడా అంటాం. ఇందులో విటమిన్ సి, ఐరన్, కాల్షియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ పండ్లు తింటే.. పొరపాటున మనం ఆహారంతో పాటే మింగేసిన వెంట్రుకలు కూడా అరుగుతాయని చెప్తారు.

ఈ ఏడాది ఎన్నడూ లేనన్ని నేరేడుపండ్లు మార్కెట్లలో కనిపిస్తున్నాయి. ఈ ఏడాది నేరేడుపండ్ల కాపు ఎక్కువగా రావడమే ఇందుకు కారణం. ఇందులో హెచ్చరిక ఏముందనుకుంటున్నారా? ఓ వ్యక్తి నెట్టింట చేసిన ఓ పోస్ట్ దీనిపై ఆసక్తిని రేపుతోంది. నేరేడుచెట్లు కాపు ఎక్కువగా ఇస్తే.. ఆ సంవత్సరం కరవు పరిస్థితులు రాబోతున్నట్లు హెచ్చరిక అంట. Rakesh Burugula అనే వ్యక్తి ఎక్స్ లో చేసిన పోస్టు ప్రకారం.. పెద్దలు.. వేసవిలో నేరేడు చెట్లు ఎన్నడూ లేనంతగా పండ్లను ఇస్తే.. ఆ సంవత్సరం కరవు వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్లాంట్ సైన్స్ ప్రకారం దీనిని మాస్టింగ్ లేదా స్ట్రెస్ ఫ్రూటింగ్ అంటారు. కొన్ని సందర్భాల్లో సూసైడ్ ఫ్రూటింగ్, బంపర్ క్రాప్ అని కూడా పిలుస్తుంటారు.

చెట్లు భూగర్భజలాలు తగ్గుతున్నాయని, వాతావరణంలో పెద్ద మార్పులు రాబోతున్నాయని గుర్తిస్తే.. తమ శక్తినంతా కొత్త కొమ్మలు, ఆకుల పెరుగులకు కాకుండా.. పండ్లు, విత్తనాల ఉత్పత్తిపై కేంద్రీకరిస్తాయట. ముఖ్యంగా నేరేడుచెట్లకు లోతుగా వెళ్లే Taproot System ఉంటుంది. భూగర్భ జలమట్టం బాగా పడిపోయినట్లు ఆ చెట్టు వేర్లు వాటర్ స్ట్రెస్ ను అనుభవిస్తాయని, అదే తీవ్రమైన వేసవి, కరువుకు సంకేతాలుగా పనిచేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఫలితంగా వేసవిలో నేరేడుపండ్లు అసాధారణంగా కాస్తుంటే.. అది ప్రకృతి నుంచి వచ్చే ఒక్క హెచ్చరికగా భావిస్తారు. అంటే.. కరువు నేపథ్యంలో తాను చనిపోతే.. తన జాతిని కొనసాగించేందుకు తర్వాతి తరానికి ఎక్కువ విత్తనాలిచ్చేందుకు ఇలా చేస్తుందని నమ్మకం. సో.. కరువు పరిస్థితుల్ని నేరేడు చెట్లు ముందే పసిగట్టాయని పెద్దలు చెప్తున్నారు.

Next Story