- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత సంతతికి మలేషియా రెండో అతిపెద్ద నిలయం: ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
ప్రపంచ అభివృద్ధిలో భారత్ ఒక అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా అవతరించిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ అభివృద్ధిలో భారత్ ఒక అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా అవతరించిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. రెండు రోజుల మలేషియా పర్యటనలో భాగంగా శనివారం రాజధాని కౌలాలంపూర్ చేరుకున్న ఆయనకు అక్కడి ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. విమానాశ్రయంలో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్వయంగా మోడీకి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన భారత సంతతి ప్రతినిధుల భారీ బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచంలో భారత్ పట్ల విశ్వసనీయత పెరిగిందని, అదే దేశానికి అతిపెద్ద బలమని మోడీ వ్యాఖ్యానించారు. బ్రిటన్ (UK), అమెరికా (USA), యూరోపియన్ యూనియన్ (EU) వంటి అగ్రదేశాలతో కుదుర్చుకున్న ఇటీవలి ఒప్పందాలే దీనికి నిదర్శనమన్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 7 నుంచి భారతీయ వస్తువులపై అమెరికా 25 శాతం అదనపు సుంకాన్ని తొలగించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో తనకున్న దశాబ్దాల కాలం నాటి స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ, ఇరు దేశాల మధ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతాయని ఆకాంక్షించారు.
తమిళ సంస్కృతికి పెద్దపీట
భారత్-మలేషియా సంబంధాలను కొత్త నిర్వచనంతో ప్రధాని వివరించారు. ఈ బంధాన్ని IMPACT (India-Malaysia Partnership for Advancing Collective Transformation) అని పిలుస్తామన్నారు. అంటే 'సామూహిక పరివర్తన కోసం భారత్-మలేషియా భాగస్వామ్యం' అని అర్థం. మలేషియాలో నివసిస్తున్న భారత సంతతి ప్రజలు ఇరు దేశాల మధ్య వారధిలా పనిచేస్తున్నారని మోడీ కొనియాడారు. భారత సంతతికి మలేషియా రెండో అతిపెద్ద నిలయం అని అన్నారు. ఇక్కడ శతాబ్దాలుగా ఉంటున్న తమిళ ప్రజల సేవలను వివరించారు. మలయా విశ్వవిద్యాలయంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన 'తిరువళ్లువర్ చైర్'తో పాటు, త్వరలోనే సంస్కృతిని బలోపేతం చేసేందుకు 'తిరువళ్లువర్ సెంటర్'ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మలేషియాలోని 500కు పైగా పాఠశాలల్లో భారతీయ భాషలను బోధిస్తున్న విషయాన్ని తన 'మన్ కీ బాత్'లో కూడా ప్రస్తావించినట్లు ఆయన గుర్తుచేశారు.
గిన్నిస్ రికార్డు దిశగా కళా ప్రదర్శన
ఈ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. సుమారు 800 మంది కళాకారులు భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, ఒడిస్సీ వంటి భారతీయ నృత్యాలను ప్రదర్శించారు. ఒకే వేదికపై అత్యధిక సంఖ్యలో కళాకారులు ప్రదర్శన ఇవ్వడంతో ఇది 'మలేషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లోకి ఎక్కిందని అధికారులు చెబుతున్నారు. మలేషియాలోని భారత సంతతి ప్రజలు తమ మలయ్ మిత్రులను కూడా వెంటబెట్టుకుని భారత్‌ను సందర్శించాలని, ప్రజల మధ్య సంబంధాలే దేశాల మధ్య మైత్రిని మరింత దృఢం చేస్తాయని మోడీ పిలుపునిచ్చారు.






