కర్ణాటకలో ప్రభుత్వ అధికారుల ఇళ్లలో లోకాయుక్త దాడులు

by Shamantha N |

కర్ణాటక లోకాయుక్త మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో ఎనిమిది మంది ప్రభుత్వ అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది.

కర్ణాటకలో ప్రభుత్వ అధికారుల ఇళ్లలో లోకాయుక్త దాడులు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక లోకాయుక్త మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో ఎనిమిది మంది ప్రభుత్వ అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఈ ఆపరేషన్ లో బెళగావిలోని ఒక సీనియర్ అధికారి నివాసం నుంచి బంగారం, వజ్రాల ఆభరణాలు, రూ. 1.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. రామతీర్థనగర్ లో ధార్వాడ్ డివిజన్‌లోని కర్ణాటక నీరావరి నిగమ్ లిమిటెడ్ (KNNL) చీఫ్ ఇంజనీర్ అశోక్ వల్సాండ్ కు చెందిన ఆయన ఇంట్లో సెర్చ్ చేశారు. ధార్వాడ్ యూనిట్‌కు చెందిన లోకాయుక్త అధికారుల ప్రత్యేక బృందం ఆయన కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించింది. వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు, ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ దాడులు చేశారు. బెంగళూరులోని గోవింద్‌రాజ్‌నగర్‌లోని (BBMP) అసిస్టెంట్ ఇంజినీర్ ప్రకాష్, శివమొగ్గలోని ఆర్గానిక్ ఫార్మింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసోసియేట్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ ప్రదీప్, చిక్కమగళూరులోని టౌన్ మునిసిపాలిటీలో అకౌంట్స్ ఆఫీసర్ లతా మణి, అనెకల్‌లోని టౌన్ మునిసిపాలిటీ చీఫ్ ఆఫీసర్ కేజీ అమర్‌నాథ్ , గదగ్‌లోని టౌన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ధ్రువరాజ్, కలబురగిలోని ఆర్‌డీపీఆర్ విభాగంలో మాజీ ఇంజినీర్ మల్లికార్జున్ అలీపూర్, కలబురగిలోని పంచాయతీ అభివృద్ధి అధికారి రామచంద్ర ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు.

గత మే, ఏప్రిల్ లోనూ లోకాయుక్త దాడులు

మే 8న కూడా కర్ణాటకలోని నలుగురు ప్రభుత్వ అధికారుల నివాసాల్లో లోకాయుక్త పోలీసులు అక్రమ ఆస్తుల కేసులో ఒకేసారి దాడులు నిర్వహించారు. కోలార్ తాలూకాలోని అదనపు డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో సర్వే సూపర్ వైజర్ జి. సురేష్ బాబు, యాదిగిర్ జిల్లా సుర్పూర్‌లో తాలూకా హెల్త్ ఆఫీసర్ రాజా వెంకటప్ప నాయక్, దావణగెరెలోని కర్ణాటక అర్బన్ వాటర్ సప్లై అండ్ డ్రైనేజ్ బోర్డులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎంబి రవి, మహాదేవపురలోని జలవనరుల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి. శ్రీనివాస్ మూర్తి ఇళ్లలో దాడులు నిర్వహించారు. గత ఏప్రిల్‌లో బళ్లారిలోని ఒక ప్రభుత్వ ఇంజనీర్ నివాసంలో కూడా లోకాయుక్త దాడులు జరిపింది. ఆ దాడిలో లగ్జరీ కార్లు, విలువైన ఆస్తులు, బంగారం సహా రూ.8 కోట్లకు పైగా ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story