Nimisha Priya: మరికొన్ని గంటల్లో కేరళ నర్సుకు ఉరిశిక్ష.. కుటుంబ సభ్యుల చివరి ప్రయత్నం ఇదే!

by Ramesh Naini |

యెమెన్‌లో కేరళకు చెందిన నిమిష ప్రియకు మరికొన్ని గంటల్లో ఉరి శిక్ష అమలు చేయనున్నారు.

Nimisha Priya: మరికొన్ని గంటల్లో కేరళ నర్సుకు ఉరిశిక్ష.. కుటుంబ సభ్యుల చివరి ప్రయత్నం ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Nimisha Priya Case) యెమెన్‌లో కేరళకు చెందిన నిమిష ప్రియకు మరికొన్ని గంటల్లో (Death Row) ఉరి శిక్ష అమలు చేయనున్నారు. నిమిష ప్రియ మరణ శిక్షను నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం, కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మరణ శిక్షను తప్పించేందుకు ఉన్న ఒక్క అవకాశం బాధిత కుటుంబానికి ‘బ్లడ్ మనీ’ ఇవ్వడం. ఈ నేపథ్యంలోనే బాధిత కుటుంబంతో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చివరి ప్రయత్నంగా భారత మత గురువుతో రాయబారం పంపినట్లు తెలిసింది. యెమెన్ లో బాధిత కుటుంబంతో మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ (Kanthapuram A.P. Aboobacker Musliyar) సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రియ తరపు న్యాయవాది తాజాగా వెల్లడించారు. యెమెన్‌లోని అధికారులు, మత గురువుల సాయంతో శిక్ష తప్పించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. (blood money) బ్లడ్ మనీని అంగీకరించేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించే ప్రయత్నిస్తున్నట్లు ఆమె తరపు న్యాయవాది పేర్కొన్నారు.

అయితే, నిమిష ప్రియ మరణ శిక్ష తప్పించలేమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తేల్చేసింది. బ్లడ్ మనీ అనేది వారి వ్యక్తిగత విషయం అని సోమవారం ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సుప్రీంకోర్టుకు ఈ అంశంపై వివరణ ఇచ్చారు. యెమెన్‌ చట్టాల ప్రకారం.. దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష తప్పుతుంది. అందుకు వారు బ్లడ్‌మనీకి అంగీకరిస్తేనే శిక్ష తగ్గించే అవకాశం ఉంటుంది. బ్లడ్‌మనీలో భాగంగా రూ.8.6 కోట్లు బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు ప్రియ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. కానీ బాధిత కుటుంబం అందుకు అంగీకరించట్లేదని తెలుస్తోంది. ఇక, భారత్ యెమెన్ దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేకపోవడంతోనే ప్రభుత్వం ఏమి చేయలేకపోతోంది.

దీంతో ఆమె ఉరిశిక్ష పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, 37 ఏళ్ల నిమిష ప్రియ తన బిజినెస్ పార్ట్‌నర్, యెమెన్ దేశస్థుడు తలాల్ అబ్దో మెహదీని మరొక నర్సు సాయంతో మత్తు మందు ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇద్దరూ అతని శరీరాన్ని ముక్కుల చేసి, అవశేషాలను భూగర్భ ట్యాంక్‌లో పడేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై కోర్టులో ఆమె సవాల్ చేసింది. కానీ కోర్టు ఆమె అప్పీళ్లు తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆమె సనా సెంట్రల్ జైల్లో ఉంది. బుధవారం (జూలై 16) ఉరికంబం ఎక్కనున్నారు.

Next Story