- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా వీడిన జో బైడెన్ కుమారుడు.. 17 మిలియన్ డాలర్ల అప్పులతో విదేశాలకు మకాం!
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయారు. ఏకంగా 17 మిలియన్ డాలర్ల అప్పుల భారంతో ఆయన అమెరికా విడిచిపెట్టి విదేశాలకు వెళ్లిపోయినట్లు కోర్టు పత్రాల ద్వారా వెల్లడైంది. గతంలో తన పన్ను, తుపాకీ సంబంధిత కేసుల్లో వాదించిన ‘విన్‌స్టన్ & స్ట్రాన్’ న్యాయసంస్థకు సైతం ఆయన ఫీజులు చెల్లించలేకపోయారు. దీనికి సంబంధించి వాషింగ్టన్ డీసీ కోర్టులో జరుగుతున్న విచారణలో హంటర్ ప్రస్తుత లాయర్ బారీ కోబర్న్ కీలక విషయాలు వెల్లడించారు. హంటర్ బైడెన్ ప్రస్తుతం విదేశాల్లో నివసిస్తున్నారని, పాత న్యాయవాదులకు బకాయి ఉన్న 50,000 డాలర్లు కూడా చెల్లించలేనంతగా ఆయన వద్ద ‘చిల్లిగవ్వ లేదని’ కోర్టుకు విన్నవించారు. తనకున్న అప్పుల భారం గురించి హంటర్ గత ఏడాది ఒక ఇంటర్వ్యూలో స్వయంగా అంగీకరించడం గమనార్హం.
దక్షిణాఫ్రికాలో ఆశ్రయం?
హంటర్ బైడెన్ కచ్చితంగా ఏ దేశంలో ఉన్నారన్నది ఆయన లాయర్ స్పష్టం చేయనప్పటికీ.. ఆయన దక్షిణాఫ్రికాకు వెళ్లి ఉండొచ్చని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. హంటర్ భార్య మెలిస్సా స్వస్థలం కేప్‌టౌన్ కావడం, వీరు గత మే నెలలో అక్కడే కనిపించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
భద్రతను రద్దు చేసిన ట్రంప్..
విదేశీ ప్రయాణాలకు భారీగా ప్రజాధనం ఖర్చవుతోందన్న కారణంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నవంబర్‌లో హంటర్‌కు ఉన్న ఫెడరల్ భద్రతను (సీక్రెట్ సర్వీస్) రద్దు చేశారు. ఒకపక్క తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెబుతూనే, హంటర్ బైడెన్ ఇటీవల ఈస్టర్ వేడుకల కోసం కాలిఫోర్నియాలో దర్శనమివ్వడం చర్చనీయాంశమైంది. సుమారు 10,000 మైళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణానికి ఎవరు ఆర్థిక సాయం చేశారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో హంటర్‌కు హాలీవుడ్ లాయర్ కెవిన్ మోరిస్ 6.5 మిలియన్ డాలర్లు అప్పుగా ఇవ్వగా, తన తండ్రి అధికారంలో ఉన్న సమయంలో కొన్ని ఆర్ట్ వర్క్స్ విక్రయించడం ద్వారా మరో 1.5 మిలియన్ డాలర్లు ఆయన ఆర్జించారని సమాచారం. తండ్రి పదవి దిగిపోయాక ఆ ఆదాయం కూడా పడిపోయినట్లు తెలుస్తోంది.






