- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Israel Operation: ఇరాన్‌పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. ప్రధాని నెతన్యాహు కీలక సందేశం
ఇరాన్ నుంచి పొంచి ఉన్న అస్తిత్వ ముప్పును శాశ్వతంగా తొలగించేందుకే ఆ దేశంపై దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్ నుంచి పొంచి ఉన్న అస్తిత్వ ముప్పును శాశ్వతంగా తొలగించేందుకే ఆ దేశంపై దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. అమెరికాతో కలిసి సంయుక్తంగా చేపట్టిన ఈ సైనిక చర్యకు ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ (Operation Lion's Roar) అని పేరు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు శనివారం దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ కేంద్రంగా సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని నెతన్యాహు పేర్కొన్నారు.
అమెరికా మద్దతుతో ముందడుగు..
ఇరాన్‌లోని కీలకమైన క్షిపణి స్థావరాలు, పారామిలటరీ రెవల్యూషనరీ గార్డ్స్, బాసిజ్ దళానికి చెందిన వాలంటీర్ల స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ఆపరేషన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందిస్తున్న నాయకత్వానికి, మద్దతుకు నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు. ‘గత 47 ఏళ్లుగా ఇరాన్ పాలన ఇజ్రాయెల్, అమెరికాకు ముప్పుగా మారింది. ఎంతోమంది అమెరికన్ల ప్రాణాలను బలి తీసుకోవడంతో పాటు, తన స్వంత పౌరులను కూడా ఆ దేశం ఊచకోత కోసింది. అటువంటి నిరంకుశ పాలన చేతికి అణ్వాయుధాలు చిక్కితే మానవాళికి ముప్పు తప్పదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆయన వివరించారు. ఇరాన్ ప్రజలకు నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించి, స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే సమయం ఆసన్నమైందని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.
పౌరులకు హెచ్చరిక..
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్ పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు. సైన్యం జారీ చేసే ఆదేశాలను తప్పకుండా పాటించాలని కోరారు. ఈ పోరాటం రానున్న రోజుల్లో కూడా కొనసాగే అవకాశం ఉందని, దేశమంతా కలసికట్టుగా, ధైర్యంగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ దాడుల ద్వారా ఇరాన్‌లో రాజకీయ మార్పులకు కూడా అవకాశం ఏర్పడుతుందని ఇజ్రాయెల్ భావిస్తోంది.






