- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, డైనమిక్ బ్యూరో: మెక్సికోలోని కాబో సాన్ లూకాస్ బీచ్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. సాధారణంగా సముద్ర మట్టానికి వేల అడుగుల లోతులో నివసించే అత్యంత అరుదైన 'ఓర్‌ఫిష్' (Oarfish) జంట లూకాస్ బీచ్ తీరానికి రావడమే ఇందుకు కారణం. సుమారు 30 అడుగుల పొడవు వరకు పెరిగే ఈ చేపలను జనం 'ప్రళయ కాలపు చేపలు' అని పిలుచుకుంటారు. మోనికా పిట్టెంజర్ అనే మహిళ తన సోదరితో కలిసి బీచ్‌లో ఉండగా, నీటి అంచున ఏదో వెలుగుతున్నట్లు గమనించారు. తీరా దగ్గరకు వెళ్లి చూడగా, రిబ్బన్ ఆకారంలో మెరుస్తూ వింతగా ఉన్న రెండు భారీ చేపలు కనిపించాయి. సాధారణంగా సముద్రంలో 3,000 అడుగుల లోతులో ఉండే ఇవి, ఇలా నీటి పైకి రావడం చూసి వారు ఆశ్చర్యపోయారు. స్థానికులు భయంతో చూస్తుండగా, మోనికా సోదరి ధైర్యం చేసి, నీటిలో కొట్టుమిట్టాడుతున్న ఆ చేపలను తిరిగి సముద్రంలోకి పంపేందుకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియోను వారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ప్రళయానికి సంకేతమా?
జపనీస్ జానపద కథల ప్రకారం.. ఓర్‌ఫిష్‌లు తీరానికి కనిపిస్తే భూకంపాలు లేదా సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని నమ్ముతారు. అందుకే వీటిని 'డూమ్స్‌డే ఫిష్' అని పిలుస్తారు. గతంలో కొన్ని భారీ భూకంపాల ముందు ఇవి కనిపించిన దాఖలాలు ఉన్నాయని పలువురు చెబుతున్నారు. దీంతో నెటిజన్లు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇవి కనిపిస్తే విపత్తు తప్పదు’ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
ఈ చేపల రాకకు, విపత్తులకు మధ్య ఎటువంటి శాస్త్రీయ సంబంధం లేదని నిపుణులు కొట్టిపారేస్తున్నారు. సముద్ర గర్భంలో కదలికలు లేదా అనారోగ్య కారణాల వల్ల ఇవి అప్పుడప్పుడు పైకి రావచ్చు కానీ, ఇవి భూకంపాలకు ముందస్తు సంకేతాలు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని వారు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా, ఈ అరుదైన చేపల దర్శనం ఇప్పుడు అటు ఆసక్తిని, మరోవైపు ఆందోళనను కలిగిస్తోంది.






