Iran Attack: దాడులు ముగిస్తున్నాం.. ఇరాన్ సైన్యం కీలక ప్రకటన

by Ramesh Naini |

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన క్షిపణి దాడుల పర్వానికి ప్రస్తుతానికి తెరపడినట్లు తెలుస్తోంది.

Iran Attack: దాడులు ముగిస్తున్నాం.. ఇరాన్ సైన్యం కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన క్షిపణి దాడుల పర్వానికి ప్రస్తుతానికి తెరపడినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మీడియా ప్రకారం.. ఇజ్రాయెల్‌పై తాము చేపట్టిన సైనిక చర్యలు ముగిశాయని ఇరాన్ సైన్యం (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. ఇజ్రాయెల్ దురాగతాలకు తగిన రీతిలోనే బుద్ధి చెప్పామని, ప్రస్తుతానికి దాడులను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే, లెబనాన్‌పై ఇజ్రాయెల్ గనుక మళ్లీ గెలికి దాడులకు పాల్పడితే.. అంతకంటే తీవ్రంగా, ఊహించని రీతిలో విరుచుకుపడతామని ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

ట్రంప్ చొరవ.. శాంతి ఒప్పందం దిశగా అడుగులు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతోనే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణకు మొగ్గు చూపుతున్నాయని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘శాంతి స్థాపన కోసం తుది విడత చర్చలు జరుగుతున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. అయితే, చర్చలు పూర్తిగా ముగిసే వరకు ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన ఆర్థిక దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.

అమెరికా అభ్యర్థనను పక్కనపెట్టి..

ఆదివారం అమెరికా అభ్యర్థనను పక్కనపెట్టి, ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇజ్రాయెల్.. లెబనాన్ రాజధాని బీరుట్‌పై భీకర దాడులు చేసింది. దీనికి ప్రతికారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌లోని మహ్‌షహర్‌ పెట్రోకెమికల్ ప్లాంట్‌తో పాటు పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడికి దిగింది. ఏప్రిల్ 8న జరిగిన తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత ఇరు దేశాల మధ్య ఈ స్థాయిలో దాడులు జరగడం ఇదే తొలిసారి.

రగులుతున్న ఎర్ర సముద్రం.. భారత్ అప్రమత్తం

ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ కూడా ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చేశారు. ఎర్ర సముద్రంలో (Red Sea) ఇజ్రాయెల్ నౌకల రాకపోకలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు, ఆ పరిధిలోకి వచ్చే శత్రు నౌకలేవీ తప్పించుకోలేవని హెచ్చరించారు. పశ్చిమాసియాలో పరిస్థితులు వేగంగా మారుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్‌లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా వెంటనే ఆ దేశాన్ని వీడాలని, ఇతరులు ఇరాన్ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని భారత రాయబార కార్యాలయం అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది.

Next Story