- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.50 వేల జరిమానా కట్టలేదని కుటుంబాన్ని వెలివేసిన కులస్తులు
తన కుమారుడు ప్రేమ వివాహం చేసుకున్నందుకు రూ.50 వేల జరిమానా సంఘానికి చెల్లించాలని, ఆ మొత్తాన్ని చెల్లించనందుకు తమను కుల బహిష్కరణ చేశారని కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు బాధితులు.

దిశ, భిక్కనూరు : తన కుమారుడు ప్రేమ వివాహం చేసుకున్నందుకు రూ.50 వేల జరిమానా సంఘానికి చెల్లించాలని, ఆ మొత్తాన్ని చెల్లించనందుకు తమను కుల బహిష్కరణ చేశారని కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు బాధితులు. భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన డొంకెన్ నర్సింలు, మంజుల ఫిర్యాదు అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తమ గోడును వెల్లబోసుకున్నారు. గత సంవత్సరం 30-04-2025న తమ కుమారుడు నవీన్, గర్గుల్ గ్రామానికి చెందిన తమ కులానికి చెందిన యువతిని తమ సమ్మతితో కుల పెద్దల అనుమతి లేకుండా హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉన్న ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నాడని తెలిపారు.
వివాహం అనంతరం కొద్ది రోజుల తర్వాత ఇంటికి వచ్చిన సందర్భంగా తమ సంప్రదాయం ప్రకారం కులస్తులందరికీ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో విందు ఏర్పాటు చేసి భోజనాలు పెట్టామని చెప్పారు. అయినప్పటికీ, కుల పెద్దల అనుమతి లేకుండా వివాహం జరిపినందుకు రూ.50 వేల జరిమానా విధించారని తెలిపారు. ఆ జరిమానా మొత్తాన్ని చెల్లించే వరకు తమ కులానికి చెందిన ఎవరూ తమతో మాట్లాడకూడదని, సామాజికంగా దూరంగా ఉండాలని షరతు విధించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించి తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.






