లోన్ యాప్ వేధింపులతో వివాహిత ఆత్మహత్య..

by Kodari Anjali |

లోన్ యాప్ వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

లోన్ యాప్ వేధింపులతో వివాహిత ఆత్మహత్య..
X

దిశ, అల్వాల్: లోన్ యాప్ వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, మృతురాలు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. శివదానపు దేవనందిని(25) నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధి జె.జె.నగర్‌లోని ఎస్‌ఎస్‌బీ క్లాసిక్ అపార్టుమెంట్లో భర్తతో కలిసి నివాసం ఉంటుంది. కృష్ణ జిల్లా గణపవరం గ్రామానికి చెందిన దేవనందిని వెస్ట్ గోదావరి జిల్లా ద్వారక తిరుమల ప్రాంతానికి చెందిన తిరుమల రేవంత్ కుమార్‌ను ప్రేమించి 2022నవంబర్ 8న వివాహం చేసుకుంది. వివాహం అనంతరం గత మూడు సంవత్సరాలుగా నేరేడ్మెట్‌లో నివసిస్తూ ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో 07-06-2026 ఉదయం 10 గంటల సమయంలో రేవంత్ కుమార్ పని మీద బయటకు వెళ్లాడు. కొంత సమయం గడిచాక పలు మార్లు ఫోన్ చేసినప్పటికీ దేవనందిని స్పందించకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా.. బెడ్ రూమ్‌లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని కనిపించింది.

బిడ్డ మృతికి అల్లుడే కారణం కావచ్చు..?

వెంటనే రేవంత్ కుమార్ పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి మొబైల్ ఫోన్ పరిశీలించారు. పోలీసులకు ఆమె ఓ గుర్తు తెలియని లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నట్లు గుర్తించారు. రుణం చెల్లింపులో జాప్యం జరుగడంతో లోన్ యాప్ నిర్వహకులు పదేపదే ఫోన్ చేసి డబ్బులు చెల్లించాలని వేధింపులకు గురిచేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ వేధింపులు తట్టుకోలేక ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో దేవనందిని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. అయితే మృతురాలు తండ్రి భీమవరపు వెంకట్ రెడ్డి తన కుమార్తె మరణంపై పలు అనుమానాలు ఉన్నాయని తన భర్త రేవంత్ కుమార్‌పై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. మూడు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం కోసం ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత దేవనందిని కుటుంబ సభ్యులతో అసలు సంబంధాలు కొనసాగించలేదని చెబుతున్నారు. కేవలం లోన్ యాప్‌‌ల బెదిరింపులే మృతికి కారణం కాకపోవచ్చని, ఆమె మృతి వెనుక మరేదైనా కుట్ర లేదా కుటుంబ విభేదాలు ఉండే అవకాశం ఉందని ఈ ఘటనలో అల్లుడి పాత్రపై సమగ్ర విచారణ జరిపి తమ కుటుంబానిక న్యాయం చేయాలని బంధువులు పోలీసులను కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Next Story