అయోధ్య నగర్ లే అవుట్‌లో అక్రమాల పై కలెక్టర్‌కు ఫిర్యాదు

by Batti.Sumithra |

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రంలోని అయోధ్య నగర్ కాలనీలో భూముల వ్యవహారం పై స్థానిక సామాజిక కార్యకర్త కొంకలి మల్లేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

అయోధ్య నగర్ లే అవుట్‌లో అక్రమాల పై కలెక్టర్‌కు ఫిర్యాదు
X

దిశ, గోపాల్‌పేట : వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రంలోని అయోధ్య నగర్ కాలనీలో భూముల వ్యవహారం పై స్థానిక సామాజిక కార్యకర్త కొంకలి మల్లేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 2004 సంవత్సరంలో సర్వే నంబర్లు 414, 415, 416, 417, 418, 419, 420, 421లలో మొత్తం 12 ఎకరాల 9 గుంటల విస్తీర్ణంలో అయోధ్య నగర్ లేఅవుట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అప్పటి గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ తీర్మానం చేసి, 11-06-2004న లేఅవుట్‌కు ఆమోదం ఇచ్చారని పేర్కొన్నారు. ఆ లే అవుట్‌లో మొత్తం 268 ప్లాట్లు ఉన్నట్లు అధికారిక పత్రాల్లో నమోదు చేసినప్పటికీ, గ్రామ పంచాయతీకి కేటాయించిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో, వాటి సంఖ్య ఎంతనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియడం లేదని మల్లేష్ ఆరోపించారు. గ్రామ ప్రజలకు సంబంధించిన ఆస్తుల వివరాలను సంబంధిత అధికారులు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మల్లేష్ వివరాల ప్రకారం లే అవుట్‌లో 933.33 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించినట్లు రికార్డుల్లో ఉన్నప్పటికీ, ఇటీవల ఆ పార్కు స్థలానికే తప్పుడు బై నంబర్లు కేటాయించి ఇతరులకు విక్రయించినట్లు గ్రామంలో చర్చ జరుగుతోందన్నారు. అంతేకాకుండా, లేఅవుట్‌కు ఆనుకొని ఉన్న ఇతర సర్వే నంబర్ల భూములు, ప్రభుత్వ పాఠశాల స్థలం, జీరో స్థలాలకు సైతం బై నంబర్లు కేటాయించి అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు.

ఈ అంశం పై ఇప్పటికే జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేను కలిసి గ్రామ ప్రజల తరఫున తన ఆవేదనను వ్యక్తం చేసినట్లు మల్లేష్ వెల్లడించారు. ప్రజా ఆస్తులు, ప్రభుత్వ భూములు, పార్కులు వంటి సామూహిక ప్రయోజనాల స్థలాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అక్రమాలు జరిగి ఉంటే వాటిని వెలుగులోకి తీసుకురావడానికి, న్యాయం జరిగే వరకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామంలో భూముల విషయంలో అనేక అనుమానాస్పద పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, లేని భూములు, లేని సర్వే నంబర్లు సృష్టించి కొందరు అక్రమ లాభాల కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితులపై గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలోని యువత, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, గ్రామ పెద్దలు కలిసి ఈ అంశం పై చర్చించి గ్రామ ప్రయోజనాలను కాపాడేందుకు ముందుకు రావాలని కొంకలి మల్లేష్ విజ్ఞప్తి చేశారు. గ్రామ భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని ఆయన కోరారు.

Next Story