ఓయూలో ప్రారంభమైన అంతర్జాతీయ యాంటెన్నా టెక్నాలజీ సదస్సు

by Batti.Sumithra |

ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు, 6జీ సాంకేతికతలు, అధునాతన యాంటెన్నా రూపకల్పన అంశాల పై ప్రపంచ నిపుణుల మేధోమథనానికి వేదికగా ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం అంతర్జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది.

ఓయూలో ప్రారంభమైన అంతర్జాతీయ యాంటెన్నా టెక్నాలజీ సదస్సు
X

దిశ, సికింద్రాబాద్ : ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు, 6జీ సాంకేతికతలు, అధునాతన యాంటెన్నా రూపకల్పన అంశాల పై ప్రపంచ నిపుణుల మేధోమథనానికి వేదికగా ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం అంతర్జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల వర్క్‌షాప్‌కు దేశ విదేశాల నుంచి ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు హాజరయ్యారు.

సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మైక్రోవేవ్ ఇంజనీరింగ్, ఐఈఈఈ ఓయూ సీఈఎపి-ఎస్, ఎంఎంటీ-ఎస్ స్టూడెంట్ బ్రాంచ్ చాప్టర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న యాంటెన్నా టెక్నాలజీ షేపింగ్ ది మోడ్రన్-డే కమ్యూనికేషన్ సిస్టమ్స్ అంశం పై ప్రొఫెసర్ కె.కె.నాయర్ ఆడిటోరియంలో ప్రారంభమైన ఈ సదస్సును ఓయూ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థల అభివృద్ధిలో యాంటెన్నా టెక్నాలజీల పాత్ర కీలకమని, అంతర్జాతీయ నిపుణులతో విద్యార్థులు, పరిశోధకులు నేరుగా మమేకమయ్యే అవకాశం విశ్వవిద్యాలయానికి గర్వకారణమని పేర్కొన్నారు.

అమెరికాకు చెందిన డాక్టర్ సుధాకర్ రావు, డాక్టర్ హావోక్సిన్, ప్రొఫెసర్ సతీష్ శర్మ, ఇటలీకి చెందిన డాక్టర్ ఫ్రాన్సెస్కో పి.ఆండ్రియుల్లి, ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ క్రిస్టోఫ్ ఫుమెక్స్, డాక్టర్ నెల్సన్ జె.జి. ఫోన్సెకా, కెనడాకు చెందిన డాక్టర్ జవాద్ వై. సిద్ధిఖీ తదితర అంతర్జాతీయ నిపుణులు సదస్సులో పాల్గొని తాజా పరిశోధనా ధోరణుల పై ఉపన్యాసాలు అందించారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.చంద్రశేఖర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.మంగు, ఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ పి.నవీన్ కుమార్ పాల్గొన్నారు.

Next Story