- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీఆర్‌సీ ప్రకటించకుంటే.. జులైలో ఉద్యమ బాట : టీఎస్‌యుటిఎఫ్ డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం రెండో పీఆర్‌సీ నివేదికను వెంటనే తెప్పించుకుని, ఈ నెలాఖరులోగా మెరుగైన ఫిట్‌మెంట్‌తో ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ డిమాండ్ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రెండో పీఆర్‌సీ నివేదికను వెంటనే తెప్పించుకుని, ఈ నెలాఖరులోగా మెరుగైన ఫిట్‌మెంట్‌తో ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఒకవేళ జూన్ నెలాఖరులోగా ప్రభుత్వం పీఆర్‌సీపై స్పష్టత ఇవ్వని పక్షంలో జులై నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలకు దిగుతామని హెచ్చరించింది. సోమవారం హైదరాబాద్‌లోని సంఘ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు చావ రవి అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు.
బడుల మూసివేత నిర్ణయం సరికాదు..
రాష్ట్ర అధ్యక్షులు చావ రవి మాట్లాడుతూ...జూన్ 2 లోపు ఇస్తామన్న పిఆర్సీ నివేదిక ఇంకా విడుదల కాలేదని, కనీసం జూన్ నెలాఖరులోపు పిఆర్‌సి నివేదిక తెప్పించుకొని పిఆర్‌సి ప్రకటించకపోతే జూలైలో పోరాటం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి.ప్రభుత్వ బడులను బలోపేతం చేసి, మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని, ప్రతి గ్రామంలోనూ బడి ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా గిరిజన, మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలే విద్యార్థులకు దిక్కని గుర్తుచేశారు.
బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి
సంఘ ప్రధాన కార్యదర్శి ఏ. వెంకట్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఉపాధ్యాయులకు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక టెట్ నిర్వహించాలని, అర్హత మార్కులను తగ్గించాలని కోరారు. ఆగస్టు నెలలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని, బీసీ, గిరిజన సంక్షేమ గురుకులాల్లో పాఠశాల సమయాలను మార్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న ఈ అంశంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పాత పెన్షన్ హామీ ఏమైంది..
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నూతన పెన్షన్ విధానాన్ని సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ వెంటనే అమలు చేయాలని టీఎస్‌యుటిఎఫ్ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో నెం. 57 ప్రకారం.. 2004 సెప్టెంబరు కంటే ముందు నియామకమైన డీఎస్‌సీ 2003 ఉపాధ్యాయులకు తక్షణమే ఓపీఎస్ వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, దుర్గా భవాని, కోశాధికారి లక్ష్మారెడ్డి, కార్యదర్శులు కె. రవికుమార్, శ్రీధర్, జ్ఞానమంజరి, నాగేశ్వరరావు, వెంకటేశం, వెంకటప్ప,విశాలి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.






