రైల్వే అప్‌డేట్స్‌కు కొత్త వేదిక.. ఎస్‌సీఆర్ అధికారిక వీడియో న్యూస్ బులెటిన్ ప్రారంభం

by Ramesh Naini |

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) పరిధిలోని తాజా పరిణామాలు, మౌలిక సదుపాయాల పురోగతి, సాధించిన విజయాలను ఎప్పటికప్పుడు చేరవేసేందుకు జోన్ చరిత్రలోనే మొట్టమొదటి అధికారిక వీడియో వార్తా బులెటిన్ ఎస్‌సీఆర్ రైల్ సమాచార్ అందుబాటులోకి వచ్చింది.

రైల్వే అప్‌డేట్స్‌కు కొత్త వేదిక.. ఎస్‌సీఆర్ అధికారిక వీడియో న్యూస్ బులెటిన్ ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) పరిధిలోని తాజా పరిణామాలు, మౌలిక సదుపాయాల పురోగతి, సాధించిన విజయాలను ఎప్పటికప్పుడు చేరవేసేందుకు జోన్ చరిత్రలోనే మొట్టమొదటి అధికారిక వీడియో వార్తా బులెటిన్ ఎస్‌సీఆర్ రైల్ సమాచార్ అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ నూతన బులెటిన్‌ను అధికారికంగా ప్రారంభించారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి విడుదలయ్యే ఈ బులెటిన్.. యూట్యూబ్, ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటుందని జీఎం ప్రకటించారు. ఈ వినూత్న ఆవిష్కరణను తీసుకొచ్చిన రైల్వే ప్రజా సంబంధాల విభాగాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రైల్వే ప్రయాణికులు జోన్ పరిధిలోని తాజా సమాచారం కోసం సరికొత్తగా ప్రారంభమైన ఎస్‌సీఆర్ రైల్ సమాచార్ బులెటిన్‌ను వీక్షించాలని జీఎం కోరారు.

రైల్వే భద్రతపై సమీక్ష..

ట్రాక్‌లపై నిర్వహణ పనులు చేపట్టే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత కఠినమైన ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని జీఎం స్పష్టం చేశారు. మే నెలలో ఇంజినీరింగ్, సెక్యూరిటీ, సేఫ్టీ, ఆపరేటింగ్ విభాగాల అధికారులు రాత్రి వేళల్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల వివరాలను, వాటి ఫలితాలను జీఎం కూలంకషంగా సమీక్షించారు. అన్ని డివిజన్లలో ముమ్మరంగా సాగుతున్న అగ్ని ప్రమాద నివారణ డ్రైవ్‌ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లకు నూతన భద్రతా మార్గదర్శకాలు, సురక్షిత పని పద్ధతులపై నిరంతరం అవగాహన కల్పించేలా నిర్వహిస్తున్న రిఫ్రెషర్ శిక్షణా కోర్సుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేట్ సైడింగ్‌లు, గూడ్స్ షెడ్‌ల వద్ద భద్రతను పటిష్టం చేసేందుకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అనంతరం, జోన్ పరిధిలోని రైలు కార్యకలాపాల భద్రతపై జీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఎస్సీఆర్ అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్‌తో పాటు వివిధ శాఖల ప్రధాన అధిపతులు నేరుగా పాల్గొనగా.. సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్ల డీఆర్ఎంలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యారు.

Next Story