- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.110 కోసం మేస్త్రీ దారుణ హత్య
కేవలం 110 రూపాయలు, మొబైల్ ఫోన్ కోసం ఓ అమాయక భవన నిర్మాణ మేస్త్రీని రాళ్లతో బాది దారుణంగా హత్య చేసిన ఘటన లాలాగుడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు రోజుల క్రితం చోటుచేసుకుంది.

దిశ, సికింద్రాబాద్ : కేవలం 110 రూపాయలు, మొబైల్ ఫోన్ కోసం ఓ అమాయక భవన నిర్మాణ మేస్త్రీని రాళ్లతో బాది దారుణంగా హత్య చేసిన ఘటన లాలాగుడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు రోజుల క్రితం చోటుచేసుకుంది. ఈ ఘోరానికి ఒడిగట్టిన ఇద్దరు డెలివరీ బాయ్స్ గా పనిచేసే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దొంగిలించిన మొబైల్, రూ.110 నగదు, నేరానికి ఉపయోగించిన ఎలక్ట్రిక్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘాట్ జిల్లాకు చెందిన జైప్రకాష్ దేశ్‌ముఖ్ (38) భవన నిర్మాణ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఈ నెల 2న కాజీపేటలో పని ముగించుకుని సాయంత్రం సికింద్రాబాద్ చేరుకున్నాడు. మియాపూర్‌లో ఉన్న తన సోదరుడి వద్దకు వెళ్లేందుకు మొండా మార్కెట్ వద్ద ఒంటరిగా నిలబడ్డాడు.
అదే సమయంలో తుకారాం గేట్‌కు చెందిన కిరాణా డెలివరీ బాయ్ ధాబీ వినోద్ (30), అడ్డగుట్టకు చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్ మక్కల మోహన్ (19) ఒంటరిగా వెళ్లేవారిని దోచుకోవాలనే స్కెచ్‌తో ఎలక్ట్రిక్ బైక్ పై అక్కడకు వచ్చారు. ఒంటరిగా ఉన్న జైప్రకాష్ ను గమనించి, రైల్వే స్టేషన్‌లో దించుతామని నమ్మించి బైక్ పై ఎక్కించుకున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లకుండా తుకారాం గేట్ రైల్వే బ్రిడ్జ్ బైపాస్ రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ జైప్రకాష్‌ను బెదిరించి అతని వద్ద ఉన్న డబ్బు, సామాగ్రి లాక్కోవడానికి ప్రయత్నించారు. అయితే, బాధితుడు గట్టిగా ప్రతిఘటించడంతో ఆగ్రహానికి గురైన నిందితులు.. పక్కనే ఉన్న పెద్ద రాళ్లను తీసుకుని అతని తలపై బలంగా బాదారు. జయప్రకాష్ రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడవడంతో, అతని జేబులో ఉన్న కేవలం రూ. 110 నగదు, మొబైల్ ఫోన్‌ను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. జూన్ 3న తెల్లవారుజామున రక్తపు మడుగులో పడి ఉన్న గుర్తు తెలియని శవాన్ని చూసి స్థానికులు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. లాలాగుడ పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి ఆధారాలు సేకరించారు.
మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో, పోలీసులు ఫోటోతో కూడిన లుకౌట్ నోటీసులను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీనిని చూసిన మృతుడి కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రి మార్చురీకి చేరుకుని మృతదేహాన్ని జైప్రకాష్‌గా గుర్తించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఘటనా స్థలపరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను, టెక్నికల్ డేటాను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులను గుర్తించి సోమవారం తెల్లవారుజామున వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఏ-1 వినోద్‌పై గతంలో మల్కాజ్‌గిరి పీఎస్‌లో క్రిమినల్ కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అత్యంత వేగంగా ఈ కేసును ఛేదించిన ఎసిపి కె. శశాంక్ రెడ్డి, లాలాగుడ ఇన్‌స్పెక్టర్ టి. అశోక్ కుమార్, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ బృందాలను సీనియర్ అధికారులు అభినందించారు.






