పర్యాటక రంగానికి రూట్‌ మ్యాప్‌ .. రాష్ట్రంలో ఎనిమిది ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు

by Naga Rani Yarlagadda |

తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పర్యాటక శాఖ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.

పర్యాటక రంగానికి రూట్‌ మ్యాప్‌ .. రాష్ట్రంలో ఎనిమిది ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు
X
  • ప్రపంచ స్థాయి వసతులు, ఐకానిక్ కట్టడాల దిశగా అడుగులు
  • ప్రపంచ స్థాయి పర్యాటక అనుభూతి కల్పించడమే లక్ష్యం
  • పర్యాటక శాఖ ఉన్నతాధికారులు, కన్సల్టెంట్లు, ఆర్కిటెక్టులు, ఇంజినీర్లతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పర్యాటక శాఖ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణ నూతన పర్యాటక విధానంలో భాగంగా తొలి దశలో ఎంపిక చేసిన 8 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను (మొత్తం 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలు) ఆకర్షణీయమైన గమ్యస్థానాలుగా అభివృద్ధి చేసేందుకు ‘సమగ్ర మాస్టర్ ప్లాన్ల’ రూపకల్పనపై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టి సారించారు. సోమవారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులు, ఆర్కిటెక్చరల్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లతో ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. పర్యాటకులు కేవలం ప్రాంతాలను చూడటానికే పరిమితం కాకుండా, ఒక విభిన్నమైన అనుభూతిని కోరుకుంటున్నారని, పర్యాటకులు మన రాష్ట్రానికి వస్తే వారికి అదొక మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోవాలని మంత్రి జూపల్లి చెపపారు. ప్రకృతి, వారసత్వం, ఆధ్యాత్మికత, సాహస క్రీడల కలబోతతో కూడిన ‘స్లో టూరిజం’ను ప్రోత్సహించాలని ఆయన వారికి దిశానిర్దేశం చేశారు.

పర్యాటకులు కేవలం ఒక ప్రాంతాన్ని సందర్శించి వెళ్లిపోయేలా కాకుండా, అక్కడి ప్రకృతి, చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికత, స్థానిక జీవనశైలిని ఆస్వాదిస్తూ మరపురాని అనుభూతిని పొందేలా సమగ్ర మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని సూచించారు. మొదటి దశలో భాగంగా వికారాబాద్, సోమశిల–అలంపూర్, వరంగల్–రామప్ప, నాగార్జునసాగర్, యాదాద్రి–పోచంపల్లి, ఆదిలాబాద్ గిరిజన క్లస్టర్, భద్రాచలం, కాళేశ్వరం ప్రత్యేక పర్యాటక ప్రాంతాలకు ఒకే తరహా ప్రతిపాదనలు కాకుండా, ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు, భౌగోళిక పరిస్థితులు, చారిత్రక నేపథ్యం, పర్యాటక అవకాశాలను అధ్యయనం చేసి ప్రత్యేక మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రపంచంలోని విజయవంతమైన పర్యాటక గమ్యస్థానాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి తెలంగాణకు అనువుగా అమలు చేయాలని సూచించిన మంత్రి, కేరళలోని జటాయు ప్రాజెక్టు కంటే భువనగిరి కొండ ప్రాంతం మరింత విస్తీర్ణం కలిగి ఉందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలన్నారు. తెలంగాణలోనూ ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లు, క్యాంటిలీవర్ వ్యూ డెక్స్, స్కైవాక్‌లు, అడ్వెంచర్ యాక్టివిటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రకృతి ఆధారిత అనుభూతులను కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని జూపల్లి కృష్ణారావు సూచించారు. చారిత్రక వారసత్వాన్ని పరిరక్షిస్తూ దేశంలోనే అత్యుత్తమ హెరిటేజ్, అడ్వెంచర్ టూరిజం కేంద్రంగా భువనగిరిని అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని ఆయన తెలిపారు. సోమశిల–అలంపూర్ సర్క్యూట్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు.

సోమశిల కృష్ణా బ్యాక్‌వాటర్స్ ప్రాంతంలో క్రూయిజ్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్, ట్రెక్కింగ్ మార్గాలు, ఎత్తైన వ్యూ పాయింట్లు, ఎకో టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్‌ల అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. జటప్రోలు, మదనగోపాలస్వామి ఆలయం వంటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలను అనుసంధానం చేస్తూ సోమశిల సర్క్యూట్‌ను రాష్ట్రంలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. తెలంగాణ పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు కీలక శక్తిగా మారేలా ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలు ఉండాలని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ గౌతమి, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్, వివిధ ఏజెన్సీల ప్రతినిధులు, కన్సల్టెంట్లు, ఆర్కిటెక్టులు, ఇంజినీర్లు, శాఖ అధికారులు పాల్గొన్నారు.

Next Story