జాగ్రత్తగా లేకపోతే తీవ్ర నష్టాలు.. SIRపై బొత్స కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

ఓటర్ల జాబితా సమీక్షపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ హెచ్చరించారు...

జాగ్రత్తగా లేకపోతే తీవ్ర నష్టాలు.. SIRపై బొత్స కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఓటర్ల జాబితా సమీక్ష(SIR)పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(MLC Botsa Satyanarayana) హెచ్చరించారు. విజయనగరం(Viziangaram)లో మీడియాతో మాట్లాడిన ఆయన ఓటరు లిస్టు మార్పులు, చేర్పులు, తొలగింపుల పరిశీలన చాలా కీలకమన్నారు. ఈనెల 12న ప్రజలతో కలిసి నిర్వహించబోయే ‘వెన్నుపోటుకి రెండేళ్లు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రికి, వ్యవసాయ శాఖ మంత్రికి రైతులు, వ్యవసాయంపై కనీస అవగాహన లేదని, గాలివానలకు పంట నష్టం జరిగినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని విమర్శించారు. మహిళలను, నిరుద్యోగులను ఈ ప్రభుత్వం పూర్తిగా మభ్యపెట్టిందని, మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్లు అని చెప్పి, రాజ్యసభ(Rajyasabha) నాలుగు స్థానాల్లో మహిళలకు చోటు కల్పించలేదని ఆరోపించారు.

డీఎస్సీలో భారీగా అక్రమాలు

డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో భారీ అక్రమాలు జరిగాయని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మూడు లక్షల మంది హాజరైన డీఎస్సీలో 16 వేల ఉద్యోగాల ఎంపిక పారదర్శకంగా జరగాలని, టెట్ రాసిన వారికే ఉద్యోగాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా నిబంధనలను పాటించలేదని ఆయన మండిపడ్డారు. డీఎస్సీలో అక్రమాలపై నిలదీసిన వారిని కేసులతో బెదిరిస్తున్నారని, నీట్ పరీక్షల తరహాలోనే ఇక్కడి డీఎస్సీలోనూ అవకతవకలు జరిగాయని, దీనిపై ఢిల్లీ తరహాలోనే ఏపీ యువత కూడా తిరగబడుతుందని హెచ్చరించారు. టీడీపీ(Tdp) నాయకులు, ఎమ్మెల్యేలు స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్లుగా ఉంటూ నచ్చిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను అమ్ముకునే దుస్థితి చంద్రబాబు కుటుంబానికి ఎందుకు వచ్చిందని బొత్స ప్రశ్నించారు.

వక్ర భాష్యం చెబుతోంది..

ప్రభుత్వం వితంతు పెన్షన్ల పంపిణీలో వక్ర భాష్యం చెబుతోందని బొత్స దుయ్యబట్టారు. కేవలం పెన్షన్ పొందుతూ చనిపోయిన వారి భార్యలకు మాత్రమే వితంతు పెన్షన్ ఇస్తున్నారని, పెన్షన్ లేని భర్త చనిపోతే ఆ భార్యకు పెన్షన్ ఎందుకు నిరాకరిస్తున్నారని నిలదీశారు. సీఎం చంద్రబాబు(Cm Chandrababu) పరిపాలన అంతా మాయ, మోసంతో కూడుకున్నదని ఆయన విమర్శించారు.

Next Story