ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుకు సిద్ధం కావాలి

by Ratna Kumari |

తక్కువ వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జిలెల్ల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.

ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుకు సిద్ధం కావాలి
X

దిశ, గోపాల్‌పేట : ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జిలెల్ల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శనివారం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామంలో ఎల్‌నినో ప్రభావం, పంట మార్పిడిపై నిర్వహించిన రైతు గ్రామసభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డా. జిలెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు విధానాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు దిగుబడితో పాటు పెట్టుబడి, నీటి లభ్యత, మార్కెట్ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఒకే పంటపై ఆధారపడకుండా పంట మార్పిడి ద్వారా నష్టాలను తగ్గించుకోవడంతో పాటు స్థిరమైన ఆదాయం పొందవచ్చన్నారు.

భూసార పరీక్షలు చేయించుకుని వాటి ఆధారంగా ఎరువులు వినియోగిస్తే సాగు వ్యయం తగ్గి దిగుబడి పెరుగుతుందని వివరించారు. వర్షపు నీటిని సంరక్షించేందుకు ఫార్మ్ పాండ్లు, ఇంకుడు గుంటలు, సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను విస్తృతంగా వినియోగించాలని సూచించారు. అధిక ఎరువుల వినియోగం వల్ల భూమి సారంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలో ఈసారి సుమారు 34 శాతం కరవు పరిస్థితులు నమోదయ్యాయని, సంబంధిత మండలంలో అది 40 శాతం వరకు ఉందన్నారు. జయన్న తిరుమలాపూర్ గ్రామంలో సుమారు 3 వేల ఎకరాల్లో సాగు జరుగుతుండగా, అందులో 700 ఎకరాలు వర్షాధారంగా ఉన్నాయని తెలిపారు.

ఇటువంటి పరిస్థితుల్లో వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటలకు బదులుగా కందులు, మినుములు, వేరుశనగ, పప్పుధాన్యాలు, కూరగాయలు, ఉద్యాన పంటలు సాగు చేయడం రైతులకు ప్రయోజనకరమని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల సలహాలు తీసుకుని శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని, నీటి వినియోగంలో పొదుపు పాటించాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, డివైఎస్‌ఓ సుధీర్ రెడ్డి, తహసీల్దార్ తిలక్ కుమార్ రెడ్డి, ఎంపీడీవో అయోష అంజమ్, ఏటీఎం నరేందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గగనం నరహరి, మాజీ ఎంపీటీసీ గుంటి శేఖర్ సాగర్, గ్రామ సర్పంచ్ గోపాల్, నాయకులు యాదయ్య, మహిళా సంఘాల ప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Next Story