బ్యాంకు డబ్బులే టార్గెట్..!

by Batti.Sumithra |

బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసిన వారినే లక్ష్యంగా చేసుకుని స్కూటీలు, కార్ల డిక్కీలు పగులగొట్టి నగదు చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడిని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

బ్యాంకు డబ్బులే టార్గెట్..!
X

దిశ, ఆదిలాబాద్ : బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసిన వారినే లక్ష్యంగా చేసుకుని స్కూటీలు, కార్ల డిక్కీలు పగులగొట్టి నగదు చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడిని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ.1.80 లక్షల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గత నెల ఆదిలాబాద్ పట్టణంలోని ఐడీబీఐ బ్యాంకులో రూ.3 లక్షలు డ్రా చేసిన వ్యక్తిని వెంబడించి, నేతాజీ చౌక్ సమీపంలో పార్క్ చేసిన ఆక్టివా డిక్కీ పగులగొట్టి నగదు అపహరించిన కేసును పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఛేదించారు. ఈ కేసులో కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన శంకర్ అలియాస్ శంకరప్పను అరెస్ట్ చేశారు.

దర్యాప్తులో నిందితుడు తన సహచరులు షేకర్, శ్రీనివాస్, సంజీవ్, సాయిల్‌తో కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసిన వారిని గమనించి, వారు వాహనాల్లో నగదు ఉంచిన సమయంలో డిక్కీలు, కార్ల అద్దాలు పగులగొట్టి చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ఈ ముఠా పై ఇప్పటివరకు 22 కేసులు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయని చెప్పారు. బ్యాంకుల నుంచి నగదు తీసుకున్న తర్వాత వాహనాల్లో నగదు ఉంచి నిర్లక్ష్యంగా వెళ్లవద్దని, అనుమానాస్పద వ్యక్తులు వెంబడిస్తున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, వన్‌టౌన్ సీఐ బి. సునీల్ కుమార్, ఎస్సై నాగనాథ్, సంజయ్, సైబర్ క్రైమ్ ఎస్సై గోపీకృష్ణ, పోలీసు సిబ్బంది రమేష్, త్రిశూల్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Next Story