- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ.. ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీ ట్రాఫిక్ జామ్
కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, దాడిని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం నగరంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు నెక్లెస్ రోడ్డులో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి, పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఈ ర్యాలీలో ముఖ్యమంత్రితో పాటు పలువురు కీలక నాయకులు పాల్గొని విద్యార్థులకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. అయితే, నగరంలో అత్యంత కీలకమైన ప్రాంతంలో ఈ ర్యాలీ జరగడం, దానికి తోడు సరిగ్గా అదే సమయంలో పీపుల్స్ ప్లాజాలో అతిపెద్ద క్రాకర్స్ షో నిర్వహించడంతో నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ భారీ ట్రాఫిక్ తో కిక్కిరిసిపోయాయి.
వీకెండ్ కావడం, క్రాకర్స్ షోను తిలకించేందుకు నగరవాసులు భారీగా తరలిరావడం, అదే సమయంలో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ ఉండటంతో ఖైరతాబాద్, లోయర్ ట్యాంక్ బండ్, సికింద్రాబాద్, నాంపల్లి వైపు వెళ్లే ప్రధాన రహదారులన్నీ కిలోమీటర్ల మేర వాహనాలతో నిండిపోయాయి. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు పలు మార్గాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేయడం, దారి మళ్లించడం చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోవడంతో వాహనదారులు, ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర నరకయాతన అనుభవించారు. ముందస్తు హెచ్చరికలు లేదా ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేయకుండా ఇలాంటి నిరసనలకు అనుమతించి, దారి మళ్లింపులు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వాహనదారులు, పోలీసుల సమన్వయ లోపంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.






