- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓవైపు కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ.. మరోవైపు ఉద్యోగాలేవి అంటూ నిరుద్యోగుల మెరుపు ధర్నా

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా నిరుద్యోగ యువత మరోసారి ఆందోళనల బాట పట్టారు. నగరంలోని ప్రముఖ చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద సాయంత్రం వేళ నిరుద్యోగులు అకస్మాత్తుగా ధర్నాకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్యోగ ప్రకటనలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చి ఆందోళనకు దిగారు. పరిస్థితి చేయిదాటిపోకుండా ముందస్తు చర్యగా పోలీసులు లైబ్రరీ ప్రధాన గేట్లను బయటి నుండి మూసివేసి, తాళాలు వేసి నిర్బంధించేందుకు యత్నించారు. అయితే, తీవ్ర ఆగ్రహానికి గురైన విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ, పోలీసుల అడ్డంకులను తోసిరాజని గేట్లను బద్దలుగొట్టుకుని మరీ లోపలికి ప్రవేశించారు. దీంతో అక్కడి పరిసర ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. మరొకవైపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన ఘటనలకు నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ నెరవేరిన సందర్బాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నెక్లెస్ రోడ్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ఊహించని ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఒకవైపు ప్రభుత్వం విజయోత్సవాల్లో మునిగి తేలుతుంటే, సరిగ్గా అదే సమయంలో నిరుద్యోగులు లైబ్రరీ వద్ద రోడ్డుపైకి వచ్చి బారికేడ్లను, గేట్లను బద్దలు కొడుతూ నిరసనలకు దిగడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. భద్రతా బలగాలు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.






