Godrej Capital: గోల్డ్ లోన్ వ్యాపారంలోకి గోద్రేజ్ క్యాపిటల్

by S Gopi |

2031 నాటికి రూ. లక్ష కోట్ల ఆస్తుల నిర్వహణ లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగమే ఈ నిర్ణయమని కంపెనీ తెలిపింది.

Godrej Capital: గోల్డ్ లోన్ వ్యాపారంలోకి గోద్రేజ్ క్యాపిటల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్, ఆర్థిక సేవల రంగంలో వేగంగా విస్తరిస్తున్న గోద్రెజ్ క్యాపిటల్ కొత్తగా గోల్డ్ లోన్ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. కంపెనీ తన అనుబంధ సంస్థ 'గోద్రెజ్ ఫైనాన్స్' ద్వారా 'కనకదుర్గ ఫైనాన్స్ లిమిటెడ్' కు చెందిన గోల్డ్ లోన్ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ కొనుగోలుతో గోద్రెజ్ సంస్థ అధికారికంగా పసిడి రుణాల మార్కెట్‌లోకి ప్రవేశించింది. అంతేకాకుండా, 2031 నాటికి రూ. లక్ష కోట్ల ఆస్తుల నిర్వహణ లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగమే ఈ నిర్ణయమని కంపెనీ తెలిపింది. ఈ కొనుగోలుతో ఆంధ్రప్రదేశ్ లోని 54 శాఖలు, రూ. 280 కోట్ల విలువైన పోర్ట్‌ఫోలియో, దాదాపు 12,000 మంది వినియోగదారులు, 250 మంది ఉద్యోగులతో ఉన్న నెట్‌వర్క్ ఇప్పుడు గోద్రెజ్ సొంతమైంది.

​ సంస్థ వ్యాపారాన్ని మెరుగైన, స్పష్టమైన ప్రణాళికతో విస్తరించాలనే తమ సంకల్పానికి ఈ ఒప్పందం నిదర్శనమని గోద్రెజ్ క్యాపిటల్ ఎండీ, సీఈఓ మనీష్ షా తెలిపారు. కస్టమర్లుకు మరిన్ని ప్రయోజనాలు అందించేలా భవిష్యత్తులోనూ తమ ప్లాట్‌ఫామ్‌ను బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, కనకదుర్గ ఫైనాన్స్ జాయింట్ ఎండీలు జయప్రకాష్ నారాయణ, శ్రీమాన్ నారాయణ స్పందిస్తూ.. వ్యాపార రంగంలో బలమైన పునాది కలిగిన గోద్రెజ్ చేతుల్లో తమ వ్యాపారాన్ని ఉంచడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఒప్పందం కస్టమర్లు, ఉద్యోగులు, వాటాదారులందరికీ మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుందని పేర్కొన్నారు.

Next Story