IRDAI: ఇన్సూరెన్స్ రంగానికి ఐఆర్‌డీఏఐ వార్నింగ్

by S Gopi |

ఒక బీమా ఉత్పత్తి ధర తెలుసుకోవాలంటే ముందుగా పేరు, మొబైల్ నంబర్, సంప్రదించేందుకు అనుమతి వంటి వ్యక్తిగత వివరాలు అడగడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.

IRDAI: ఇన్సూరెన్స్ రంగానికి ఐఆర్‌డీఏఐ వార్నింగ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: బీమా రంగంలో వినియోగదారులను తప్పుదారి పట్టించే 'డార్క్ ప్యాటర్న్స్'ను వెంటనే తొలగించాలని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఛైర్మన్ అజయ్ సేథ్ భీమా కంపెనీలకు స్పష్టమైన హెచ్చరిక చేశారు. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కస్టమర్ల విశ్వాసాన్ని నిలబెట్టాలంటే పూర్తి పారదర్శకత తప్పనిసరి అని చెప్పారు. ఒక బీమా ఉత్పత్తి ధర తెలుసుకోవాలంటే ముందుగా పేరు, మొబైల్ నంబర్, సంప్రదించేందుకు అనుమతి వంటి వ్యక్తిగత వివరాలు అడగడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. కస్టమర్ వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే బీమా ఉత్పత్తి వివరాలు, ధరలు నేరుగా కనిపించేలా వ్యవస్థ ఉండాలని, అవసరం లేని సమాచారాన్ని తీసుకుని నిర్ణయాలను ప్రభావితం చేసే పద్ధతులనే 'డార్క్ ప్యాటర్న్స్'గా పరిగణిస్తామని స్పష్టం చేశారు. అలాగే, అనుమతి అనేది కేవలం చట్టపరమైన ప్రక్రియ కాకుండా, పాలసీ నిబంధనలు పూర్తిగా అర్థమయ్యాకే వినియోగదారు నిర్ణయం తీసుకునేలా ఉండాలని సూచించారు. ఈ నెలలో విడుదలైన లోకల్‌సర్కిల్స్ అధ్యయనం ప్రకారం దేశంలోని టాప్ 300 లిస్టెడ్ కంపెనీల్లో దాదాపు 95 శాతం సంస్థలు కనీసం ఒక డార్క్ ప్యాటర్న్‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వినియోగదారుల హక్కుల పరిరక్షణ, డిజిటల్ పారదర్శకత, భీమా రంగంపై నమ్మకాన్ని బలోపేతం చేయడం కోసం నియంత్రణ సంస్థలు మరింత కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాయి.

Next Story