US Tariff: అమెరికా 10 శాతం సుంకం ప్రభావం పరిమితమే

by S Gopi |

జెనెరిక్ ఔషధాలు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇప్పటికే ఇతర నిబంధనల కింద మినహాయింపులో ఉన్నాయి.

US Tariff: అమెరికా 10 శాతం సుంకం ప్రభావం పరిమితమే
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్ నుంచి ఎగుమతి అయ్యే కొన్ని వస్తువులపై అమెరికా అదనంగా 10 శాతం సుంకం విధించినప్పటికీ, వాటిలో సుమారు 45 శాతం వస్తువులు ఈ సుంకం పరిధిలోకి రావని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జెనెరిక్ ఔషధాలు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇప్పటికే ఇతర నిబంధనల కింద మినహాయింపులో ఉన్నాయి. అలాగే ఉక్కు, అల్యూమినియం, ఆటో విడిభాగాల వంటివి ఇప్పటికే ప్రత్యేక సుంకాల పరిధిలో ఉన్నందున, ఈ కొత్త 10 శాతం సుంకం వర్తించదని తెలిపింది. మిగిలిన 55 శాతం ఎగుమతులపై మాత్రమే ఈ సుంకం ప్రభావం ఉంటుందని, అయినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌కు తక్కువ పన్నులు వర్తించేలా అమెరికాతో జరిగిన చర్చలు ఫలించాయని పేర్కొంది. టెక్స్‌టైల్ రంగానికి సంబంధించిన ప్రత్యేక విధానం ఇంకా అమల్లోకి రాలేదని, ఇదే సమయంలో ప్రతిపాదిత భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని కూడా వెల్లడించింది. అమెరికా లేవనెత్తిన 'ఫోర్స్‌డ్ లేబర్' ఆందోళనల నేపథ్యంలో, బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల దిగుమతిని నిషేధించేలా భారత్ ఇటీవల తన విదేశీ వాణిజ్య విధానాన్ని సవరించడం కూడా ఈ ప్రక్రియలో కీలక అడుగుగా ప్రభుత్వం పేర్కొంది.

Next Story