విద్యార్థుల నమోదు లక్ష్యసాధనలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం

by Batti.Sumithra |

10 శాతం అదనపు విద్యార్థుల నమోదు లక్ష్యసాధనలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యార్థుల నమోదు లక్ష్యసాధనలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం
X

దిశ, మంచిర్యాల టౌన్ : 10 శాతం అదనపు విద్యార్థుల నమోదు లక్ష్యసాధనలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి పి. చంద్రయ్యతో కలిసి యూ-డైస్ ఆన్‌లైన్ పోర్టల్‌లో జూలై 25, 2026 నాటి విద్యార్థుల నమోదు నివేదికను విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్య కంటే 10 శాతం అదనపు విద్యార్థులను నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించిందని తెలిపారు. గత విద్యా సంవత్సరంలో జిల్లాలో 43,072 మంది విద్యార్థులు ఉండగా, 2026–27 విద్యా సంవత్సరానికి 47,379 మంది విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 45,350 మంది విద్యార్థులు నమోదయ్యారని, గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పటికే 2,278 మంది అదనంగా చేరారని తెలిపారు. దీంతో 10 శాతం అదనపు నమోదు లక్ష్యంలో 95.72 శాతం సాధించి మంచిర్యాల జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రెండో స్థానంలో, జగిత్యాల జిల్లా మూడో స్థానంలో ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని 275 ప్రభుత్వ పాఠశాలలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10 శాతం కంటే అధిక విద్యార్థుల నమోదును సాధించాయని పేర్కొన్నారు. మండలాల వారీగా మందమర్రి, జైపూర్ మండలాలు 100 శాతం లక్ష్యాన్ని చేరుకోగా, హాజీపూర్ 99.91 శాతం, నస్పూర్ 99.76 శాతం, భీమారం 98.24 శాతం, నెన్నెల్ 98 శాతం అత్యుత్తమ పురోగతి సాధించాయని తెలిపారు. మొత్తం 18 మండలాల్లో 10 మండలాలు 96 నుంచి 100 శాతం వరకు లక్ష్యాన్ని చేరుకున్నాయని తెలిపారు. జూలై 23 నాటి యూ-డైస్ గణాంకాల ప్రకారం 3,352 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం ప్రభుత్వ విద్యపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత అర్హతలు కలిగిన ఉపాధ్యాయులతో పాటు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (స్మార్ట్ టీవీలు), ఐసీటీ కంప్యూటర్ ల్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల ద్వారా డిజిటల్ విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 82 పాఠశాలల్లో కంప్యూటర్ బోధకులను నియమించినట్లు వెల్లడించారు.

పాఠశాలల్లో మౌలిక వసతులు బలోపేతం చేయడంతో పాటు 8 అకాడమిక్ పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేసి విద్యా ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. బాలికలు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్ విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తున్నామని, అవసరమైన వసతి గృహాలు, ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రతి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలో చదువు పూర్తి చేసిన విద్యార్థులను తదుపరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్వయంగా చేర్పించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 10వ తరగతి పూర్తి చేసిన బాలికలను కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. జిల్లా స్థాయిలో తరచూ జూమ్ సమీక్షలు నిర్వహించడం, మండల విద్యాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం, ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మారే విద్యార్థుల బదిలీలను వేగంగా ఆమోదించడం, 8 అకాడమిక్ పర్యవేక్షణ బృందాల ద్వారా పాఠశాలల పనితీరును మెరుగుపరచడం వంటి చర్యల ఫలితంగానే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిందని తెలిపారు.

Next Story