16,871 కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ పోస్టుల పొడిగింపు

by velandi.Saikiran |

: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో పనిచేస్తున్న వివిధ కేటగిరీలకు చెందిన 16,871 ఒప్పంద సిబ్బందికి ప్రభుత్వం తీపి కబురు అందించింది.

16,871 కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ పోస్టుల పొడిగింపు
X

వైద్య ఆరోగ్య శాఖలో 16,871 కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ పోస్టుల పొడిగింపు

డీఎంఈలో ఒప్పంద సేవల పునరుద్ధరణ.

ఈ ఏడాది ఏప్రిల్1 నుంచి ఏడాది పాటు పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు

దిశ, తెలంగాణ బ్యూరో: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో పనిచేస్తున్న వివిధ కేటగిరీలకు చెందిన 16,871 ఒప్పంద సిబ్బందికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, గౌరవ వేతనం (హానరేరియం), ఎంటీఎస్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల సేవా కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ పొడిగింపు ఈ ఏడాది ఏప్రిల్1 నుంచి మార్చి 31, 2027 వరకు ఏడాది పాటు అమల్లో ఉంటుందని జీవోలో స్పష్టం చేశారు. ఒకవేళ ఈ లోపు సదరు ఖాళీలలో రెగ్యులర్ నియామకాలు చేపట్టినా లేదా సేవలతో అవసరం తీరిపోయినా ఈ కాలపరిమితి అంతటితో ముగుస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రులు, ఆర్‌ఐఎంఎస్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న 4,801 మంది కాంట్రాక్ట్ సేవలు, 9,009 మంది అవుట్‌సోర్సింగ్ సేవలు, సీనియర్ రెసిడెంట్లతో సహా 3,056 మంది హానరోరియం పనిచేసే సిబ్బంది సేవలు, 5 ఎంటీఎస్ సేవల సిబ్బందికి పొడిగింపు లభించింది. వీరందరి వేతనాల చెల్లింపుకు సంబంధించి ప్రభుత్వం కొన్ని కీలక మార్గదర్శకాలను కూడా విధించింది. కాంట్రాక్ట్, గౌరవ వేతనం, ఎంటీఎస్ ఉద్యోగులకు ఐఎఫ్ఎంఐఎస్-డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా నామినల్ బ్యాంక్ ఖాతాల్లోకే నగదు జమచేయాలని, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి మాత్రం థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా వేతనాలు చెల్లించాలని సూచించింది. అదే విధంగా సేవా కాలం పొడిగింపు పొందిన సిబ్బందితో పాటు సంబంధిత అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలతో నూతన ఒప్పందాలు కుదుర్చుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా రిటైర్డ్ ఉద్యోగులను ఈ పోస్టులలో తిరిగి నియమించకూడదని, ఖాళీగా ఉన్న పోస్టులను ఆర్థిక శాఖ అనుమతి లేకుండా భర్తీ చేయరాదని స్పష్టం చేసింది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలు (డీఎస్సీ), జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Next Story