హైదరాబాద్ జిల్లాలో నత్తకే నడకలు నేర్పుతున్న ‘సర్’ ప్రక్రియ

by Batti.Sumithra |

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్–2026) ప్రక్రియ హైదరాబాద్ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ముఖ్యంగా ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్) డిజిటలైజేషన్ నత్తకే నడకలు నేర్పుతున్నట్లుగా ఉంది.

హైదరాబాద్ జిల్లాలో నత్తకే నడకలు నేర్పుతున్న ‘సర్’ ప్రక్రియ
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్–2026) ప్రక్రియ హైదరాబాద్ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ముఖ్యంగా ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్) డిజిటలైజేషన్ నత్తకే నడకలు నేర్పుతున్నట్లుగా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుండగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాల్లో మాత్రం తీవ్ర జాప్యం నెలకొంది. రాష్ట్ర సగటు 70 నుంచి 80 శాతం వరకు ఉండగా, హైదరాబాద్‌తో పాటు మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలు చాలా వెనుకబడి ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో దాదాపు 47 లక్షల 36 వేల 669 మంది ఓటర్లు ఉండగా, శుక్రవారం నాటికి కేవలం 49.15 శాతం మేరకు, అంటే 23 లక్షల 28 వేల 95 ఫారాలు మాత్రమే డిజిటలైజ్ కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 41.30 శాతం డిజిటలైజేషన్ మాత్రమే పూర్తైంది.

ఇండ్లు మారడంతో...

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కోసం బస్తీల్లో తిరుగుతున్న బీఎల్‌వోలకు ఓటర్లను గుర్తించడం గగనంగా మారింది. ఈ ప్రక్రియ 2002 ఓటర్ల జాబితా ఆధారంగా జరుగుతుండగా, అప్పట్లో అద్దె ఇళ్లలో ఉన్నవారిలో చాలా మంది ప్రస్తుతం ఇతర ప్రాంతాలకు మారిపోయారు. పాత అద్దెదారుల వివరాలు ఇవ్వడానికి ప్రస్తుత ఇంటి యజమానులు నిరాకరించడం, వారు ప్రస్తుతం ఉంటున్న చిరునామాలు గుర్తించలేకపోవడం వల్ల ఫారాల పంపిణీ జరగడం లేదు. హైదరాబాద్ జిల్లాలో దాదాపు 11.52 లక్షల మంది ఓటర్లు ఇండ్లు మారడంతో బీఎల్‌వోలకు ఫారాల పంపిణీ తలబొప్పిగా మారింది. ఒకవైపు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు, మరోవైపు ఫారాల పంపిణీ పూర్తి కాకపోవడం బీఎల్‌వోలను ఆందోళనకు గురి చేస్తోంది. 2002 నాటి ఓటర్ల జాబితా వివరాలు, ప్రస్తుత సమాచారం సరిపోలకపోవడం, ఆన్‌లైన్ పోర్టల్‌లో సాంకేతిక లోపాలు ఉండడం వల్ల కూడా ప్రక్రియ మందగించింది.

ఆందోళనలో ఓటర్లు...

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆగస్టు 3తో సర్ గడువు ముగియనుంది. దీనికి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండగా, ఇప్పటికీ దాదాపు సగం ప్రక్రియ కూడా పూర్తికాకపోవడం ఓటర్లలో గందరగోళాన్ని రేకెత్తిస్తోంది. తమ ఓటు ఉంటుందో, తొలగిపోతుందో తెలియక బీఎల్‌వోలు ఎప్పుడు వస్తారా అని ఆరా తీస్తున్నారు. వారి ఫోన్ నంబర్లు సేకరించి సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నారు. నగరంలోని హై-రైజ్ అపార్ట్‌మెంట్లు, ఐటీ కారిడార్‌లోని విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీల్లో బూత్ లెవల్ అధికారులను సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించడం లేదు. అసోసియేషన్ ప్రతినిధులు కూడా పూర్తిస్థాయిలో సహకరించకపోవడంతో వందలాది కుటుంబాలు ఉన్న కాంప్లెక్స్‌లలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ సాధ్యం కావడం లేదు. బీఎల్‌వోలు ఉపయోగించే యాప్ తరచూ సర్వర్ సమస్యలను ఎదుర్కొంటోంది. ఫోటోలు, ఆధార్ వివరాలు అప్‌లోడ్ చేసే సమయంలో డేటా సేవ్ కాకపోవడంతో ఒకే పనిని రెండు, మూడు సార్లు చేయాల్సి వస్తోంది. చదువుకోని లేదా మురికివాడల్లో నివసించే ఓటర్లకు మొబైల్ ద్వారా ఫారాలు నింపడం తెలియక, బీఎల్‌వోలు స్వయంగా కూర్చొని వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. దీంతో ఒక్కో ఇంటికి 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతోంది. ఇలా జిల్లాలో సర్ ప్రక్రియ సగం కూడా పూర్తికాకపోవడంతో ఒకవైపు అధికారులు, మరోవైపు ఓటర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

సొంత ఊరివైపే మొగ్గు...

ఉద్యోగం, ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి ఇక్కడే నివాసముంటున్న వారిలో చాలామంది ఇప్పటి వరకు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండేవారు. అయితే, తాజా సర్ నిబంధనల ప్రకారం రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నట్లు గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించడంతో, నగరంలో నివసిస్తున్న వారు తమ సొంత ఊర్లలోనే ఓటు హక్కు కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా, హైదరాబాద్‌లో ఓటు నమోదు చేసుకుంటే సొంత గ్రామాల్లో లభించే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయనే భయంతో కూడా చాలామంది నగరంలో ఓటు హక్కు కొనసాగించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇదీ ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ మహానగరంలో సర్ ప్రక్రియ మందకొడిగా సాగడానికి మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

Next Story