- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యురేనియం దేశం దాటొద్దు.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కీలక ఆదేశాలు
అమెరికా, ఇజ్రాయెల్‌లతో శాంతి చర్చలు జరుగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా మొజ్తాబా ఖమేనీ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా, ఇజ్రాయెల్‌లతో శాంతి చర్చలు జరుగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా మొజ్తాబా ఖమేనీ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఆయుధాల తయారీకి సిద్ధంగా ఉన్న తమ దేశ యురేనియం నిల్వలను ఎట్టిపరిస్థితుల్లోనూ విదేశాలకు తరలించవద్దని అధికారులను ఆదేశించారు. అమెరికా-ఇజ్రాయెల్ పెడుతున్న ప్రధాన డిమాండ్లను తోసిపుచ్చుతూ ఇరాన్ తన పంథాను మరింత కఠినతరం చేసినట్లు ఇరాన్ మీడియా తెలిపింది.
అమెరికా, ఇజ్రాయెల్ ప్రధాన డిమాండ్లు
అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించాలంటే శాంతి ఒప్పందంలో భాగంగా యురేనియం నిల్వలను దేశం దాటించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ పట్టుబడుతున్నాయి. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను పూర్తిగా తొలగించాలి. క్షిపణి సామర్థ్యాలను అంతం చేయాలి. ఇతర దేశాల్లోని ప్రాక్సీ ఉగ్రవాద గ్రూపులకు ఇరాన్ మద్దతును పూర్తిగా నిలిపివేయాలి. ఈ షరతులకు అంగీకరిస్తేనే యుద్ధం ముగిసినట్లు ప్రకటిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్ వద్ద ఉన్న 60 శాతం వరకు శుద్ధి చేసిన యురేనియం నిల్వలతో దాదాపు 11 అణుబాంబులను తయారు చేయవచ్చని ఇజ్రాయెల్ రక్షణ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇరాన్ వ్యూహాత్మక అభ్యంతరాలు - అనుమానాలు
యురేనియం నిల్వలను దేశం దాటిస్తే భవిష్యత్తులో అమెరికా, ఇజ్రాయెల్ నుంచి జరిగే దాడులను తిప్పికొట్టే శక్తి తగ్గిపోతుందని ఇరాన్ భావిస్తోంది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ప్రారంభమైన ఈ యుద్ధంలో ప్రస్తుతం తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతోంది. అయితే, ఈ విరామం కేవలం అమెరికా పన్నుతున్న వ్యూహాత్మక కుట్ర మాత్రమేనని, మళ్లీ దాడులు చేయడానికి అమెరికా సిద్ధమవుతోందని ఇరాన్ అనుమానిస్తోంది. యురేనియంను దేశం దాటించే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఇరాన్ వర్గాలు, ఈ సమస్య పరిష్కారానికి మరో మార్గాన్ని సూచించాయి. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) పర్యవేక్షణలో తమ వద్ద ఉన్న యురేనియం నిల్వలను పలుచన (Dilution) చేయడానికి సిద్ధమని ఇరాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
గతంలో జరిగిన దాడుల అనంతరం ఇరాన్‌లోని ఇస్ఫహాన్, నతాంజ్ అణు కేంద్రాల్లోని భూగర్భ సొరంగాల్లో ఈ నిల్వలను భద్రపరిచినట్లు ఐఏఈఏ అంచనా వేస్తోంది. కేవలం వైద్య అవసరాలు, పరిశోధనల కోసమే తాము యురేనియంను శుద్ధి చేస్తున్నామని, అణు ఆయుధాల తయారీ తమ లక్ష్యం కాదని ఇరాన్ పునరుద్ఘాటించింది.






