- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు : అబుదాబిలోని BAPS హిందూ దేవాలయం మూసివేత
పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. దీంతో అబుదాబిలోని BAPS హిందూ దేవాలయం క్లోజ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికాలు దాడులకు దిగడం, దానికి ప్రతిచర్యగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అబుదాబిలోని ప్రముఖ బీఏపీఎస్ (BAPS) హిందూ దేవాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
భద్రతా కారణాలతోనే నిర్ణయం..
జాతీయ భద్రతా సంస్థల సూచనలు, ప్రస్తుత అత్యవసర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ యాజమాన్యం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ మార్గదర్శకాల ప్రకారం, భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయాన్ని మూసివేస్తున్నాము. ప్రతి ఒక్కరి క్షేమమే మాకు అత్యంత ప్రాధాన్యం. త్వరలోనే పరిస్థితులు చక్కబడి శాంతి నెలకొనాలని ప్రార్థిస్తున్నాము’ అని అధికారులు పేర్కొన్నారు.
దుబాయ్‌లో పేలుళ్ల కలకలం..
శనివారం తెల్లవారుజామున ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లను యూఏఈ రక్షణ దళాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో దుబాయ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు సమాచారం. సోషల్ మీడియాలో కూడా వీటికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కేవలం దుబాయ్ మాత్రమే కాకుండా, సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో కూడా పేలుడు శబ్దాలు వినిపించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్పీ (AFP) వెల్లడించింది. ప్రస్తుతానికి ఆలయ దర్శనాలను నిలిపివేసిన అధికారులు, పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత తదుపరి సమాచారాన్ని భక్తులకు తెలియజేస్తామని స్పష్టం చేశారు.






