- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్యాక్స్ సిలికా.. మజాకా!
20వ శతాబ్దాన్ని చమురు, స్టీల్ రూల్ చేశాయని, 21వ శతాబ్దాన్ని కంప్యూటర్లు, వాటికి అవసరమైన ఖనిజాలు నడుపుతాయని అమెరికా ఎకనమిక్ అఫైర్స్ ప్రతినిధి జాకోబ్ హెల్బెర్గ్(ప్యాక్స్ సిలికా కూటమి ఏర్పాటుకు బాధ్యుడు) ప్రకటించారు. అందుకే ఇప్పుడు కంప్యూటర్లు, ఏఐ టెక్, అందుకు అవసరమైన ఖనిజాల కోసం పోటీ మొదలైంది. వీటి ఆధారంగా సమీప భవిష్యత్‌లో కొత్త కూటములు పుట్టుకొచ్చే అవకాశముంది. అమెరికా ఇది వరకే ప్యాక్స్ సిలికా కూటమి ప్రయత్నాలు మొదలు పెట్టింది.

దిశ, నేషనల్ బ్యూరో: కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని రూల్ చేయనుంది. ఇది అన్ని రంగాలపైనా పైచేయి సాధించనుంది. ఏఐని నియంత్రించగల దేశం ప్రపంచానికి పెద్దన్నగా మారే అవకాశముంది. అందుకే ఏఐకి అవసరమైన ముడి పదార్థాలు, సప్లై చైన్, వసతుల కోసం ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏఐ ఆవిష్కరణలతో సిలికాన్ వ్యాలీ ముందంజలో ఉండగా డీప్‌సీక్ వంటి ప్రయోగాలతో చైనా ఒక్క ఉదుటన అందుకు పోటీగా నిలిచింది. ఏఐకి అవసరమైన అరుదైన ఖనిజాలకు చైనా నెలవుగా ఉండటంతో ఈ పోటీలో అమెరికా వంటి అగ్రదేశాలకూ ఏఐ భవితపై బెంగ పుట్టింది. అందుకే అమెరికా ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. రేర్ ఎర్త్‌ల కోసం చైనాపై డిపెండెన్సీని తగ్గించడానికి డ్రాగన్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిందే ప్యాక్స్ సిలికా కూటమి. ఈ కూటమి దేశాల ద్వారా ఏఐ టెక్‌కు అవసరమైన ముడి పదార్థాల నుంచి ఫైనల్ ప్రొడక్ట్ తయారుచేసే వరకు ఏ లోటు లేకుండా చూసుకోవాలని అమెరికా భావిస్తున్నది. గతేడాది డిసెంబర్‌లో అమెరికా ఇనాగరల్ సమ్మిట్ నిర్వహించింది. ఈ కూటమిలో ఇది వరకే ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, యూకే, ది నెదర్లాండ్స్, యూఏఈ వంటి దేశాలు చేరాయి. త్వరలోనే భారత్ సైతం చేరుతుందని కొత్త రాయబారి సెర్జియో గోర్ ఆహ్వాన వచనాలు పలికారు.
అమెరికాకు చైనా భయం?
చైనా టెక్ సహా అన్ని రంగాల్లోనూ గణనీయమైన వృద్ధి సాధిస్తున్నది. కావాల్సినన్ని రేర్ ఎర్త్ మినరల్స్ ఉండటం, స్టార్టప్‌ల ఉత్సాహం, ఆవిష్కరణల జోరుతో దూసుకుపోతున్నది. ఇది ఇలాగే సాగితే ఏఐ రంగంలో చైనా పైచేయి సాధించే అవకాశముంది. రేర్ ఎర్త్ విషయంలో అమెరికాకు, చైనాకు మధ్య పెద్ద వార్ నడిచింది. టారిఫ్‌లు పోటాపోటీగా విధించుకుని రేర్ ఎర్త్‌పై డీల్ చేసుకున్నాయి. ప్రపంచంలోని 70 శాతం రేర్ ఎర్త్ మైనింగ్ చైనాలోనే ఉన్నది. 90 శాతం ప్రాసెసింగ్ కెపాసిటీ కూడా ఈ డ్రాగన్ కంట్రీకి ఉంది. ఇప్పటికీ అమెరికా దాదాపు 70 నుంచి 80 శాతం రేర్ ఎర్త్ కాంపౌండ్ల కోసం చైనాపై ఆధారపడుతున్నది. ఈ రేర్ ఎర్త్ మినరల్స్‌ను విదేశాలకు పంపడానికి చైనా అనేక ఆంక్షలు విధించింది. తద్వార విదేశాల్లో గ్లోబల్ హైటెక్ సప్లై చైన్‌లో ప్రాబల్యాన్ని కలిగి ఉంది. ఈ పరిణామాలు అగ్రరాజ్యం అమెరికాకు పంటికింద రాయిలా ఉన్నాయి.
ప్యాక్స్ సిలికాతో ఇండియాకు బెనిఫిట్ ఏమిటి?
భారత్‌లో సెమీకండక్టర్ల ఉత్పత్తిలో వినియోగించే అరుదైన ఖనిజాలు 8.52 మిలియన్ టన్నులు(ప్రభుత్వవర్గాల ప్రకారం) కలిగి ఉన్నది. కానీ, మన దేశం 2,900 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నది. అదే చైనా 2.70 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొడ్యూస్ చేస్తున్నది. అందుకే భారత్ దేశీయ పరిశ్రమల అవసరాలకూ దిగుమతులపై ఆధారపడాల్సి వస్తున్నది. 2024-25లో సుమారు 57 వేల టన్నుల అరుదైన ఖనిజాలు దిగుమతి చేసుకుంది. ఇందులో 93 శాతం చైనా నుంచి దిగుమతి చేసుకున్నవే. ఇది మనపై.. చైనా ప్రాబల్యాన్ని పెంచే చాన్స్ ఉన్నది. గతేడాది ఆరు నెలలు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ చైనా పంపకుంటే ఇక్కడ ఆటోమోటివ్ ఇండస్ట్రీ సతమతమైపోయింది. అందుకే కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ తెచ్చి గనుల అన్వేషణను వేగవంతం చేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ప్యాక్స్ సిలికాలో భారత్ చేరితే చైనాపై మన డిపెండెన్సీని తగ్గించి వేర్వేరు దేశాల నుంచి దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉంటుంది. క్రిటికల్ మినరల్స్‌కు చైనాకు బదులు ఆస్ట్రేలియా నుంచి సేకరించవచ్చు. జపాన్, ది నెదర్లాండ్స్‌లతో భాగస్వామ్యం ద్వారా ఇన్వెస్ట్‌మెంట్లు, సాంకేతిక దిగుమతులూ పొందొచ్చు. వచ్చే ఏఐ యుగంలో భారత్ సైతం ప్రముఖ స్థానంలో నిలవడానికి ఈ కూటమి ఉపయోగపడొచ్చనేది ఒక అంచనా.






