మైనర్లపై లైంగిక వేధింపులు.. అమెరికాలో భారతీయ పౌరుడు అరెస్ట్

by Naga Rani Yarlagadda |

మైనరప్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని అమెరికాలో ఓ భారతీయ యువకుడిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

మైనర్లపై లైంగిక వేధింపులు.. అమెరికాలో భారతీయ పౌరుడు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో నివసిస్తున్న ఒక భారతీయ పౌరుడిని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు అరెస్ట్ చేశారు. 13 ఏళ్ల లోపు వయస్సున్న చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సదరు వ్యక్తిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అరెస్టయిన వ్యక్తిని ఓదెల యశస్వి కొత్తపల్లిగా అధికారులు గుర్తించారు. నిందితుడు సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్నట్లు (undocumented immigrant) తేలింది. ఇతనిపై లైంగిక దాడి ఆరోపణలతో పాటు, షాప్ లిఫ్టింగ్ (దుకాణాల్లో చోరీ), బహిరంగ ప్రదేశాల్లో శాంతికి విఘాతం కలిగించడం వంటి కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నట్లు ICE పేర్కొంది.

ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం యశస్వి కొత్తపల్లిని దేశం నుండి బహిష్కరించే (Removal Proceedings) ప్రక్రియ కొనసాగుతుందని, అంతవరకు అతను కస్టడీలోనే ఉంటాడని అధికారులు స్పష్టం చేశారు. సమాజ భద్రతకు ముప్పు కలిగించే హింసాత్మక నేరస్తులను ఏమాత్రం ఉపేక్షించబోమని ఏజెన్సీ స్పష్టం చేసింది. అయితే.. ఇతని అరెస్ట్ తేదీ, ఇతర నేరాలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.

ఈ అరెస్ట్ నేపథ్యంలో.. అమెరికా నుండి భారతీయుల బహిష్కరణలు భారీగా పెరుగుతున్నాయన్న గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2023లో 617 మంది, 2024లో 1,368 మందిని బహిష్కరించగా, 2025లో ఈ సంఖ్య ఏకంగా 3,800 దాటింది. ఇది దశాబ్ద కాలంలోనే అత్యధికం. ప్రస్తుతం మెక్సికో, హోండురాస్, గ్వాటెమాల తర్వాత అత్యధికంగా భారతీయులే అమెరికా ఇమ్మిగ్రేషన్ జైళ్లలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అక్రమ మార్గాల్లో (డంకీ రూట్) అమెరికాలోకి ప్రవేశిస్తున్న వారిపై 2025 నుండి అక్కడి ప్రభుత్వం నిఘా పెంచింది. మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ల ద్వారా మోసపోయి సరిహద్దులు దాటుతున్న వారిని గుర్తించి వెనక్కి పంపుతున్నారు. ప్రస్తుతానికి యశస్వి కొత్తపల్లి న్యూజెర్సీ కోర్టులో క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఆరోపణలు కోర్టులో నిరూపితమైతే శిక్ష అనుభవించిన అనంతరం లేదా అంతకంటే ముందే ఫెడరల్ చట్టాల ప్రకారం అతనిని భారతదేశానికి పంపించే అవకాశం ఉంది.

Next Story