- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కెనడాలో భారత సంతతి పోలీసు అధికారి తరుణ్ హత్య
కెనడాలో ఒక విచారకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒంటారియో ప్రావిన్స్‌లో విధి నిర్వహణలో ఉన్న భారత సంతతి పోలీసు అధికారి తరుణ్ బాలి దారుణ హత్యకు గురయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో : కెనడాలో ఒక విచారకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒంటారియో ప్రావిన్స్‌లో విధి నిర్వహణలో ఉన్న భారత సంతతి పోలీసు అధికారి తరుణ్ బాలి (29) దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తర అంటారియోలోని హర్స్ట్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘోర ఘటన జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అంటారియో ప్రావిన్షియల్ పోలీస్ (OPP) విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తరుణ్ బాలి, దాదాపు రెండున్నరేళ్లుగా సేవలందిస్తున్నారు. మెంటల్ హెల్త్ యాక్ట్ కింద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, కస్టడీ నుంచి తప్పించుకున్న ఒక 18 ఏళ్ల యువకుడిని పట్టుకోవడానికి తరుణ్ బాలి ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితుడు తరుణ్‌ను తన వాహనంతో బలంగా ఢీకొట్టాడు. తీవ్ర గాయాలపాలైన తరుణ్ బాలి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
నిందితుడిపై మర్డర్ కేసు నమోదు..
ఈ దారుణానికి ఒడిగట్టిన 18 ఏళ్ల నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఫస్ట్-డిగ్రీ మర్డర్ (ముందస్తు ప్రణాళికతో కూడిన హత్య), పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడం, ప్రమాదకరమైన డ్రైవింగ్ వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు OPP కమిషనర్ థామస్ కారిక్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఉన్నత స్థాయి దర్యాప్తు జరుపుతోంది. ‘ప్రజల రక్షణ కోసం తరుణ్ బాలి చూపిన ధైర్యం, చేసిన త్యాగం ఎన్నటికీ మరువలేనివి. ఈ కష్టసమయంలో ఆయన కుటుంబానికి, తోటి సిబ్బందికి నా గాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’ అని ఈ సందర్భంగా అంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ తెలిపారు. OPP అసోసియేషన్ ప్రెసిడెంట్ డేవిడ్ సబాటిని స్పందిస్తూ, ఫ్రంట్‌లైన్ పోలీసు అధికారులు ప్రతిరోజూ సమాజ రక్షణ కోసం ఎంతటి ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారో ఈ ఘోర ఘటన మరోసారి గుర్తుచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తరుణ్ బాలి కుటుంబానికి అంటారియో ప్రభుత్వం, పోలీసు శాఖ అన్ని విధాలా అండగా ఉంటాయని స్పష్టం చేశాయి.






