భారత్‌లో పెను మార్పులను ప్రపంచం చూస్తోంది.. ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారత్‌లో పెను మార్పులను ప్రపంచం చూస్తోంది.. ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజకీయాల్లో ఇవాళ అత్యంత చారిత్రాత్మకమైన రోజు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఆయన దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో.. ఢిల్లీలో ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం జరిగింది. ఈ భేటీకి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోడీకి కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కూటమి సాధించిన విజయాలు, దేశ ప్రగతిపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.

కూటమి విజయం.. ప్రజల నమ్మకం

సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఎన్డీఏ సాధించిన ఈ భారీ విజయం కేవలం ఒక్కరిది కాదని, కూటమిలో ఉన్న అన్ని భాగస్వామ్య పార్టీలకు ఈ విజయం దక్కుతుందని స్పష్టం చేశారు. ‘భారతదేశంలో ఎక్కువ కాలం ప్రధానిగా సేవలు అందించే గొప్ప అవకాశాన్ని కల్పించిన దేశ ప్రజలందరికీ నేను శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దేశాభివృద్ధి నిరంతరం సాగాలంటే ఒక స్థిరమైన ప్రభుత్వం ఉండాలని ప్రజలు బలంగా కోరుకున్నారు. అందుకే ఎన్డీఏను మళ్లీ ఆశీర్వదించారు’ అని మోడీ పేర్కొన్నారు.

2014కు ముందు.. ఆ తర్వాత..

గత పాలకుల వైఫల్యాలను, తమ ప్రభుత్వ విజయాలను ప్రధాని ఈ సందర్భంగా బేరీజు వేశారు. 2014కు ముందు దేశంలో అవినీతి, పాలనా పక్షపాతం, నిర్ణయాలు తీసుకోలేని స్థితి వంటి అనేక తీవ్రమైన సమస్యలు ఉండేవని ప్రధాని గుర్తు చేశారు. 2014 తర్వాత ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దేశ రూపురేఖల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పారు. దేశ ప్రజల్లో ప్రభుత్వంపై, వ్యవస్థలపై నమ్మకం పెరిగిందన్నారు. తాము గత 12 ఏళ్లలో ప్రవేశపెట్టిన వినూత్న పథకాలు, సంస్కరణల వల్ల దేశవ్యాప్తంగా వచ్చిన సానుకూల మార్పులను చూసి తాము గర్వపడుతున్నామని సగర్వంగా ప్రకటించారు. కాంగ్రెస్‌ పరిపాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయని, రూ.వేల కోట్ల స్కాంలు జరిగాయని అన్నారు. కాంగ్రెస్‌ తన వైఫల్యాలను హిందువులపై నెట్టిందని, దేశ వృద్ధిరేటు కూడా దారుణంగా ఉండేదని ప్రధాని మోడీ అన్నారు.

భారత్ మాత్రం సగర్వంగా నిలబడింది..

తాము తెచ్చిన పథకాలతో దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని ప్రధాని మోడీ అన్నారు. అదేవిధంగా రైతుల జీవితాల్లో పెను మార్పులు తెచ్చాయని గుర్తు చేశారు. ఈ 12 ఏళ్లలె మహిళలు, యువతుల్లో ఆత్మవిశ్వాసం పెంచామనే సంతృప్తి ఉందన్నారు. ఇంటర్నెట్‌ వాడేవాళ్ల సంఖ్యను 25 కోట్ల నుంచి 100 కోట్లకు పెంచామని అన్నారు. భారత్‌ 2014కు ముందు ఎలా ఉందో.. ఇప్పుడెలా ఉందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కామెంట్ చేవారు. దశాబ్దాల పాటు పరిపాలించిన కాంగ్రెస్‌ ఏం చేసిందో ఆలోచించాలని అన్నారు. కరోనా సమయంలో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనం అయ్యాయని.. కానీ, భారత్ మాత్రం సగర్వంగా నిలబడిందని తెలిపారు. సంక్షోభ సమయంలోనూ 7.8 శాతం గ్రోత్ రేట్ ఉండటం మామూలు విషయం కాదన్నారు. నవతరం యువత ఆశలు, ఆకాంక్షలు మారుతున్నాయని ప్రధాని అన్నారు.

నక్సలిజాన్ని నిర్మూలించాం..

కాంగ్రెస్‌ ఇనుప సంకెళ్ల నుంచి దేశాన్ని రక్షించామని ప్రధాని మోడీ అన్నారు. తమది లెక్కల ప్రభుత్వం కాదని.. ఆచరణాత్మక ప్రభుత్వమని తెలిపారు. ఇంటర్నెట్‌, డిజిటలైజేషన్‌లో గణనీయ వృద్ధి సాధించామని అన్నారు. ఇక కొన్ని విషయాల్లో సామాన్య ప్రజలపై భారం తగ్గించేందుకు తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని.. మధ్యతరగతి ప్రజల సవాళ్లు ఏంటో అర్థం చేసుకుని ముందుకు వెళ్తున్నామని అన్నారు. తమకు కూటమి కాదని.. దేశమే అన్నింటికంటే ముఖ్యమని స్పష్టం చేశారు. గతంలో ఆర్టికల్ 370 అంటే భయపడేవారని, తాము వచ్చి రద్దు చేశామని తెలిపారు. గతంలో ఉగ్రవాతం పేరు చెబితే భయపడేవారని, తాము వచ్చాకే దాడులు చేసి అణచివేశామని అన్నారు. దేశం నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించామని, భారత్‌లో వస్తున్న పెను మార్పులను ప్రపంచం ఆసక్తిగా చూస్తోందని ప్రధాని మోడీ తెలిపారు.

Next Story