- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాటుసారా, అక్రమ మద్యంపై ఉక్కుపాదం.. ఎక్సైజ్ అధికారులకు డీసీ దశరథ్ కఠిన ఆదేశాలు
రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్న నాటుసారా, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డ్రగ్స్ రవాణాపైనా ఉక్కుపాదం మోపాలని రంగారెడ్డి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్న నాటుసారా, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డ్రగ్స్ రవాణాపైనా ఉక్కుపాదం మోపాలని రంగారెడ్డి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ అధికారులను ఆదేశించారు. అక్రమ దందాలను అరికట్టడంతో పాటు, వివిధ కేసుల్లో పట్టుబడిన సరుకును స్టేషన్లలో కుప్పలుగా పోసి ఉంచకుండా వెంటనే డిస్పోజల్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఆబ్కారీ భవన్‌లో రంగారెడ్డి డివిజన్ స్థాయి ఎక్సైజ్ అధికారులతో ఆయన విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
నాటు సారా తయారీ, విక్రయాలను పూర్తిగా అరికట్టాలి..
రంగారెడ్డి ఉమ్మడి జిల్లా పరిధిలోని ఐదు ఎక్సైజ్ జిల్లాల్లో ఆశించిన స్థాయిలో రెవెన్యూ సాధించాలంటే కిందిస్థాయి నుంచి అధికారుల పనితీరు మరింత మెరుగుపడాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు. ప్రధానంగా ఎక్సైజ్ స్టేషన్ బాధ్యులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్, డీటీఎఫ్ టీమ్‌లు పూర్తి సమన్వయంతో, మరింత చురుగ్గా పనిచేయాలన్నారు. ప్రభుత్వ మద్యం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నాటు సారా తయారీ, విక్రయాలను పూర్తిగా అరికట్టాలని, తమ డివిజన్ పరిధిలో నాటు సారా అనేది ఎక్కడా కనిపించకుండా చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు ద్వారా, ఇతర అంతర్రాష్ట్ర సరిహద్దు మార్గాల ద్వారా పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలివస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, ఫ్యూరియస్ లిక్కర్ సరఫరాను పూర్తిస్థాయిలో అడ్డుకోవాలన్నారు. దీనికోసం నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సూచించారు.
లేదంటే ఎక్సైజ్ శాఖకు రెవెన్యూ పెరగదు!
మరోవైపు యువతను నిర్వీర్యం చేస్తున్న సింథటిక్ డ్రగ్స్ అమ్మకాలు, వినియోగం, రవాణాపైనా ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడికక్కడ చెక్ పెట్టాలని అధికారులను దశరథ్ ఆదేశించారు. పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ద్వారా డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించాలన్నారు. వీటన్నింటినీ అరికడితే తప్ప ఎక్సైజ్ శాఖకు ఆశించిన మేర రెవెన్యూ పెరగదని, అధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని ఆయన తేల్చి చెప్పారు.
సరుకును వెంటనే డిస్పోజల్ చేయండి..
ఇక వివిధ దాడుల్లో పట్టుబడిన గంజాయి, సింథటిక్ డ్రగ్స్, ఎన్‌డీపీఎల్ మద్యం, బెల్లం, గుడుంబాలను స్టేషన్లలో దీర్ఘకాలం పాటు నిల్వ ఉంచడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని, వాటిని ఎప్పటికప్పుడు డిస్పోజల్ చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం ఆయా వస్తువుల డిస్పోజల్‌కు అవసరమైన ఉన్నతాధికారుల అనుమతుల కోసం తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని అధికారులకు సూచించారు. పట్టుబడిన సరుకును క్లియర్ చేయడం ద్వారా స్టేషన్ల నిర్వహణ కూడా సాఫీగా సాగుతుందన్నారు. ఈ సమావేశంలో శంషాబాద్, సరూర్‌నగర్, మల్కాజిగిరి, మేడ్చల్, వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు ఈఎస్ కృష్ణ ప్రియ, ఉజ్వల రెడ్డి, నవీన్, ఫయాజొద్దీన్, విజయ్ భాస్కర్‌గౌడ్‌లతో పాటు ఆయా జిల్లాల అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు ఏఈఎస్, ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు, డీటీఎఫ్ అధికారులు, వివిధ స్టేషన్ల సీఐలు తదితరులు పాల్గొన్నారు.






