సీఎంసీ పరిధిలో కఠినంగా ‘నో బిన్ – నో ట్రేడ్’ అమలు

by Vemula.Srinu Prasad |

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) పరిధిలో ‘నో బిన్ – నో ట్రేడ్’ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని, వ్యాపార సంస్థల్లో వ్యర్థాల నిర్వహణ పట్ల బాధ్యత పెంపొందించాలని కమిషనర్ సృజన ఆదేశించారు. ..

సీఎంసీ పరిధిలో కఠినంగా ‘నో బిన్ – నో ట్రేడ్’ అమలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) పరిధిలో ‘నో బిన్ – నో ట్రేడ్’ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని, వ్యాపార సంస్థల్లో వ్యర్థాల నిర్వహణ పట్ల బాధ్యత పెంపొందించాలని కమిషనర్ సృజన ఆదేశించారు. స్వచ్ఛ ఆటోలు ప్రతిరోజూ తప్పనిసరిగా నిర్వహించబడేలా చూడాలని, దీర్ఘకాలంగా విధులకు హాజరు కాని పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి నివేదించాలని, అలాగే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం విధించే జరిమానాలకు సంబంధించిన నివేదికలను ప్రతిరోజూ సమర్పించాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ అంశాలపై సంబంధిత అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణను మరింత బలోపేతం చేయాలని, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణతో పారిశుద్ధ్య కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ) అధికారులతో కలిసి అన్ని వార్డుల్లో సంయుక్త తనిఖీలు నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. ప్రతి జోన్‌లోని వార్డులన్నింటినీ జూన్ నెలాఖరులోగా జోనల్ కమిషనర్లు సందర్శించి, గుర్తించిన సమస్యలపై చర్యల నివేదికలను సమర్పించాలని సూచించారు. వ్యర్థాల నిర్వహణలో భాగంగా ‘డ్రై వేస్ట్, వెట్ వేస్ట్, శానిటరీ వేస్ట్, స్పెషల్ కేర్ వేస్ట్’ అనే నాలుగు రకాల వ్యర్థాల వేరు వేరు సేకరణను సమర్థవంతంగా అమలు చేయాలని కమిషనర్ ఆదేశించారు. మూలస్థాయిలోనే వ్యర్థాల వర్గీకరణపై ప్రజలు, వ్యాపార సంస్థలు మరియు ఇతర భాగస్వాముల్లో అవగాహన పెంచాలని సూచించారు. పారిశుద్ధ్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు శానిటేషన్ సిబ్బంది నియామకం, వినియోగంపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలు, ఇతర భారీ వ్యర్థాల సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రతిపాదనలను పరిశీలించి, ‘ఆన్-కాల్, షెడ్యూల్డ్ కలెక్షన్ సేవలను’ అమలు చేసే అవకాశాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు (Solid Waste Management Rules) గురించి అధికారులకు వివరించారు. నిబంధనల్లో పేర్కొన్న బాధ్యతలు, విధానాలు మరియు వ్యర్థాల నిర్వహణ ప్రమాణాలను క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ప్రతి అధికారి, సిబ్బంది తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాల విజయవంతమైన అమలుకు జవాబుదారీతనం, నిరంతర పర్యవేక్షణ, సమయానుకూల నివేదికలు, కట్టుదిట్టమైన అమలు అత్యంత అవసరమని కమిషనర్ పేర్కొన్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, పర్యావరణహిత సైబరాబాద్ నిర్మాణమే కార్పొరేషన్ లక్ష్యమని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పారిశుద్ధ్య ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని సూచించారు.

Next Story