ప్రభుత్వ ఉద్యోగుల పై దాడులను సహించేది లేదు : ఎంఆర్వో హెచ్చరిక

by Batti.Sumithra |

మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో బుధవారం ఉదయం తీవ్ర కలకలం రేగింది.

ప్రభుత్వ ఉద్యోగుల పై దాడులను సహించేది లేదు : ఎంఆర్వో హెచ్చరిక
X

దిశ, మర్పల్లి : మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో బుధవారం ఉదయం తీవ్ర కలకలం రేగింది. ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారన్న సమాచారంతో విధుల్లో భాగంగా అక్కడికి వెళ్లిన గ్రామ పంచాయతీ అధికారి (జీపీఓ) బాలరాజు పై కొందరు వ్యక్తులు తిరగబడ్డారు. తవ్వకాలను నిలిపివేయాలని కోరిన అధికారిని దుర్భాషలాడుతూ, ఆయన పై దాడికి యత్నించడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికుల కథనం ప్రకారం బుధవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో తుమ్మలపల్లి గ్రామంలో కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జీపీఓ బాలరాజు వెంటనే అక్కడికి చేరుకుని తవ్వకాలను అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు లేకుండా మట్టి తరలించడం చట్టవిరుద్ధమని వారించారు. దీంతో ఆగ్రహానికి గురైన సదరు వ్యక్తులు జీపీఓ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆయనను అసభ్య పదజాలంతో దూషిస్తూ, దాడి చేయడానికి ప్రయత్నించారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారి పై దాడికి యత్నించడం, దుర్భాషలాడటం వంటి చర్యల పై రెవెన్యూ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి యత్నించిన 11 మంది పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో రెవెన్యూ యంత్రాంగం ఫిర్యాదు చేసింది. ఘటన పై స్థానిక తహసిల్దార్ స్పందిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, ఉద్యోగుల రక్షణకు భంగం కలిగించేలా ప్రవర్తించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రభుత్వ సిబ్బంది పై దాడులకు పాల్పడే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి సంఘటనలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. ఈ కేసును త్వరగా దర్యాప్తు చేసి నిందితుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు ఆయన తెలిపారు.

Next Story