- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైబర్ నేరాలు, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలే కొత్త ముప్పు: డీజీపీ సి.వి. ఆనంద్
రాష్ట్రంలో ఒకప్పుడు శాంతిభద్రతలకు సవాలుగా నిలిచిన లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం సమస్యను సమర్థంగా అధిగమించామని, అయితే ప్రస్తుతం సమాజం సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, రోడ్డు ప్రమాదాల రూపంలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఒకప్పుడు శాంతిభద్రతలకు సవాలుగా నిలిచిన లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం సమస్యను సమర్థంగా అధిగమించామని, అయితే ప్రస్తుతం సమాజం సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, రోడ్డు ప్రమాదాల రూపంలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కోడానికి కేవలం పోలీసు యంత్రాంగమే కాకుండా గ్రామస్థాయి నుంచి ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన డీజీపీ.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా పర్యటనలో భాగంగా డీజీపీ ఆదిలాబాద్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇంటిగ్రేటెడ్ సిసిటివి మానిటరింగ్ సిస్టం, చిల్డ్రన్ ట్రాఫిక్ ట్రైనింగ్ పార్కును ప్రారంభించడంతో పాటు డీ అడిక్షన్ సెంటర్ ను సందర్శించారు. గ్రామసభలో క్రీడాకారులకు, రంగోలి పోటీల విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.
పోలీసులు ప్రజలకు చేరువ కావాలి..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్, సైబరాబాద్ తరహాలోనే ఆదిలాబాద్ జిల్లా కూడా సురక్షితమైన జిల్లాగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్ పట్టణంలో 600 కెమెరాలు, గ్రామాల్లో 1200 కెమెరాలతో కలిపి మొత్తం నిఘా వ్యవస్థను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించడంపై హర్షం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉండి, కీలక రవాణా కారిడార్‌గా ఉన్న ఆదిలాబాద్‌లో ఈ టెక్నాలజీ పోలీసింగ్ నేరాల నియంత్రణకు, రోడ్డు ప్రమాదాల నివారణకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో డీజీపీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజూ కనీసం 3 నుంచి 5 గంటల సమయాన్ని ప్రత్యేకంగా ప్రజల ఫిర్యాదుల స్వీకరణకు కేటాయించాలని స్పష్టం చేశారు. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నప్పుడే వారిలో నమ్మకం పెరుగుతుందని హితవు పలికారు. సైబర్ నేరాలు, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని, స్కూళ్లు, కాలేజీల్లో యాంటీ నార్కోటిక్స్, సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేసి యువతను చైతన్య పరచాలని ఆదేశించారు. నేర పరిశోధనలో డాగ్ స్క్వాడ్ సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో పురోగతి..
గుడిహత్నూర్ మండలం తోష గ్రామంలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో డీజీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రత అనేది ఉమ్మడి బాధ్యత అని, ప్రతి గ్రామంలో రోడ్డు భద్రతా కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. గత ఏడాది జనవరి నుంచి మే వరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో 72 మంది మరణించగా, ఈ ఏడాది అది 48కి తగ్గిందని వెల్లడించారు. ఈ 24 మంది ప్రాణాలు కాపాడటం అంటే 24 కుటుంబాలను విషాదం నుంచి కాపాడటమేనని, అవగాహన పెరగడం వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా మరణాలను మరింత తగ్గించవచ్చని పేర్కొన్నారు.
డ్రగ్స్ విషయంలో పంజాబ్‌ను చూసి నేర్చుకోవాలి..
మాదకద్రవ్యాల వ్యసనంపై డీజీపీ యువతను హెచ్చరించారు. ఒకప్పుడు వ్యవసాయం, పరిశ్రమల్లో అగ్రగామిగా ఉన్న పంజాబ్ రాష్ట్రం.. డ్రగ్స్ మహమ్మారి వల్ల సామాజికంగా, ఆర్థికంగా ఎంతటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోందో గమనించాలని కోరారు. తెలంగాణ యువత అటువంటి అలవాట్లకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, దేశాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాల్లో భారీ వాహనాల పార్కింగ్ వల్ల ప్రమాదాలు జరగకుండా గ్రామ కమిటీలు నిఘా పెట్టాలన్నారు. ఈ పర్యటనలో డీజీపీతో పాటు సీఐడీ ఏసీబీ డీజీ చారు సిన్హా, ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా, మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






