- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Padma Viswanathan : బుకర్ ప్రైజ్.. షార్ట్‌లిస్ట్ జాబితాలో భారత సంతతి రచయిత
2026 అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ రేసులో భారత సంతతికి చెందిన కెనడియన్-అమెరికన్ రచయిత్రి పద్మ విశ్వనాథన్ చోటు దక్కించుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: 2026 అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ రేసులో భారత సంతతికి చెందిన కెనడియన్-అమెరికన్ రచయిత్రి పద్మ విశ్వనాథన్ చోటు దక్కించుకున్నారు. పోర్చుగీస్ భాషలో ఉన్న ఒక నవలను ఇంగ్లీష్‌లోకి అద్భుతంగా అనువదించినందుకు గాను ఆమె ఈ ప్రతిష్టాత్మక అవార్డు షార్ట్‌లిస్ట్‌లో నిలిచిన ప్రపంచ టాప్-6 కంటెండర్లలో ఒకరిగా ఎంపికయ్యారు. బ్రెజిలియన్ రచయిత్రి అనా పౌలా మైయా రాసిన పోర్చుగీస్ నవలను పద్మ విశ్వనాథన్ ఇంగ్లీషులోకి ‘ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈజ్ బినీత్’ (On Earth As It Is Beneath) పేరుతో అనువదించారు. బ్రెజిల్‌లోని ఓ మారుమూల జైలు నేపథ్యంగా సాగే ఈ నవల.. అక్కడి క్రూరత్వం, న్యాయానికి మధ్య ఉన్న సన్నని గీతను, శిక్షల తీరును కళ్లకు కట్టినట్లు వివరిస్తుందని జ్యూరీ ప్రశంసించింది. ఈ జ్యూరీ ప్యానెల్‌లో భారతీయ రచయిత్రి నీలాంజన ఎస్. రాయ్ కూడా సభ్యురాలిగా ఉన్నారు.
షార్ట్‌లిస్ట్‌లో మహిళలదే పైచేయి
కాగా, 58 ఏళ్ల పద్మ యూనివర్సిటీ ఆఫ్ అర్కాన్సాస్‌లో క్రియేటివ్ రైటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. నవలా రచయిత్రిగా, నాటక రచయిత్రిగా ఎంతో గుర్తింపు పొందిన ఈమె పుస్తకాలు ఇప్పటికే ఎనిమిది దేశాల్లో ప్రచురితమయ్యాయి. మంగళవారం ప్రకటించిన ఈ షార్ట్‌లిస్ట్‌లో మహిళలదే పైచేయిగా ఉంది. ఎంపికైన ఆరుగురు రచయితల్లో ఐదుగురు, ఆరుగురు అనువాదకుల్లో నలుగురు మహిళలే కావడం గమనార్హం. మొత్తం 8 దేశాలకు (బ్రెజిల్, బల్గేరియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, తైవాన్, యూకే, యూఎస్ఏ) చెందిన రచనలు ఈ జాబితాలో ఉన్నాయి.
విజేత ప్రకటన ఎప్పుడంటే
బుకర్ ప్రైజ్ విజేతకు 50,000 పౌండ్ల (GBP) నగదు బహుమతి లభిస్తుంది. నిబంధనల ప్రకారం దీనిని మూల రచయిత, అనువాదకులు సమానంగా (50-50) పంచుకుంటారు. షార్ట్‌లిస్ట్ అయిన మిగిలిన ప్రతి పుస్తకానికి కూడా 5,000 పౌండ్ల బహుమతి అందుతుంది. తుది విజేతను మే 19న లండన్‌లోని టేట్ మోడ్రన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అధికారికంగా ప్రకటించనున్నారు.
గత ఏడాది విజేతలు మనవారే
2025లో ఈ అంతర్జాతీయ బుకర్ ప్రైజ్‌ను భారతీయ కన్నడ రచయిత్రి భాను ముస్తాక్, అనువాదకురాలు దీపా బస్తి ‘హార్ట్ ల్యాంప్’ (Heart Lamp) అనే కథా సంపుటికి గాను సంయుక్తంగా గెలుచుకున్నారు. కన్నడ భాష నుంచి అనువదించబడి ఈ అవార్డును గెలుచుకున్న తొలి పుస్తకంగా ఇది చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అవార్డు వచ్చిన వెంటనే యూకేలో ఆ పుస్తకం కాపీలు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.






