అంతరిక్ష యాత్రకు ఇండో-అమెరికన్‌ వ్యోమగామి అనిల్‌ మేనన్‌.. ఇంటర్వ్యూ కావాలా?

by Naga Rani Yarlagadda |

నాసా అంతరిక్ష పరిశోధనల చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమవ్వనుంది. మరో భారతీయ సంతతి వ్యక్తి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

అంతరిక్ష యాత్రకు ఇండో-అమెరికన్‌ వ్యోమగామి అనిల్‌ మేనన్‌.. ఇంటర్వ్యూ కావాలా?
X

దిశ, వెబ్‌డెస్క్: నాసా అంతరిక్ష పరిశోధనల చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమవ్వనుంది. మరో భారతీయ సంతతి వ్యక్తి, నాసా వ్యోమగామి అయిన అనిల్ మీనన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జూలై 14న కజకిస్తాన్ లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ప్రయోగించే సోయుజ్ ఎంఎస్ -29 (Soyuz MS-29) నౌక ద్వారా ఆయన అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్నారు. రష్యాకు చెందిన రోస్కోస్మోస్ కాస్మోనాట్స్ ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికినాలతో కలిసి ఆయన 8 నెలల సుదీర్ఘ మిషన్ లో భాగం కానున్నారు. వీరంతా 8 నెలలపాటు.. అంటే 240 రోజులపాటు స్పేస్ స్టేషన్ లో గడిపిన అనంతరం 2027లో భూమికి చేరుకోనున్నారు.

ఈ ఎనిమిది నెలల అంతరిక్ష యాత్రలో భాగంగా అనిల్ మీనన్ భవిష్యత్ చంద్రుడి, అంగారకుడి (Mars) మిషన్లకు ఉపయోగపడే పలు కీలక శాస్త్రీయ పరిశోధనల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా శూన్య గురుత్వాకర్షణ శక్తి (మైక్రోగ్రావిటీ) వల్ల మానవ శరీరంలోని రక్తనాళాల నిర్మాణం, రక్త ప్రసరణ, రక్తం కూర్పుపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశాలపై ఆయన పరిశోధనలు చేయనున్నారు. వీటితో పాటు స్పేస్ స్టేషన్‌లోని త్రాగునీటి వ్యవస్థను ఉపయోగించి అత్యవసర ఐవీ ద్రవాలను (Intravenous Fluids) తయారు చేసే సాంకేతికతను కూడా ఆయన పరీక్షించనున్నారు. ఐఎస్ఎస్ కు వెళ్లనున్న అనిల్ ను ఇంటర్వ్యూ చేయాలనుకునేవారు జూన్ 17 సాయంత్రంలోగా [email protected] కు రిక్వెస్ట్ లు పంపాలని నాసా తెలిపింది. జూన్ 22న ఎంపిక చేసిన వారికి ఆయన ఇంటర్వ్యూలు ఇస్తారని స్పష్టం చేసింది.

ఎవరీ అనిల్ మేనన్..

అనిల్ మేనన్ విషయానికొస్తే.. అమెరికాలోని మిన్నియాపాలిస్ లో భారతీయ, ఉక్రేనియన్ వలస దంపతులకు జన్మించారు. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి న్యూరో బయాలజీలో బ్యాచిలర్ డిగ్రీపూర్తి చేశారు. ఆ తర్వాత స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్, మెడిసిన్ పట్టాలను అందుకున్నారు. ఎమర్జెన్సీ మెడిసిన్, ఏరోస్పేస్ మెడిసిన్.. రెండింటిలోనూ బోర్డు సర్టిఫికేషన్లు సాధించిన ఆయన.. యునైటెడ్ స్టేట్స్ స్పేస్ ఫోర్స్ లో కల్నల్ గా కూడా సేవలందిస్తున్నారు. వైద్యం, ఇంజినీరింగ్, ఏవియేషన్ రంగాల్లో ఆయనకున్న అపారమైన అనుభవమే వ్యోమగామిగా ఎంపికయ్యేందుకు తోడ్పడింది.

గతంలో అనిల్.. నాసా ఎక్స్ పెడిషన్ ఫ్లైట్ సర్జన్ గా పనిచేస్తూ ఐఎస్ఎస్ లోని వ్యోమగాములకు వైద్యసేవలందించారు. ఆ తర్వాత స్పేస్ ఎక్స్ కు తొలి ఫ్లైట్ సర్జన్ గా వ్యవహరించారు. స్పేస్‌ఎక్స్ చారిత్రాత్మక 'డెమో-2' మిషన్ రూపకల్పనలో, డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా వ్యోమగాములను పంపే వైద్య సహాయక వ్యవస్థల అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. నాసా 2021లో మీనన్‌ను వ్యోమగామి శిక్షణకు ఎంపిక చేయగా, రెండేళ్ల కఠిన శిక్షణ అనంతరం 2024లో ఆయన అధికారికంగా వ్యోమగామిగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు.

Next Story