మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ.. మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు సరెండర్

by Prasad Jukanti |   (  Updated:2026-06-17 08:59:07  IST  )

మావోయిస్ట్ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు దశాబ్దాలుగా సాయుధ బలగాలను వణికించిన మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్ట్ లొంగిపోయారు.

మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ..  మోస్ట్ వాంటెడ్  మహిళా మావోయిస్టు సరెండర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టు పార్టీలో సరెండర్ల పర్వం కొనసాగుతోంది. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ తో అనేక మంది మావోయిస్టులు సరెండర్ కాగా మిగిలిన వారి కోసం వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో రెండు దశాబ్దాలకు పైగా ప్రభుత్వ సాయుధ బలగాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్ట్ నేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) సభ్యురాలు శకుంతల అలియాస్ పుష్పలొంగిపోయారు. బుధవారం ఒక తుపాకీ, 40 రౌండ్ల తూటాలతో ఆమె కోల్ కతా పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ఆమెపై ప్రభుత్వం రూ. 10 లక్షల భారీ రివార్డును ప్రకటించింది.

సాంస్కృతిక విభాగం నుండి సాయుధ పోరాటం వైపు..

ఈ సందర్భంగా కోల్‌కతా పోలీస్ కమిషనర్ అజయ్ నంద్ మాట్లాడుతూ.. శకుంతల 2001లో చాలా చిన్న వయసులోనే మావోయిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై ఆర్గనైజేషన్‌లో చేరినట్లు చెప్పారు. తొలుత సాంస్కృతిక విభాగంలో విప్లవ గీతాలు, ప్రచారం, కరపత్రాల పంపిణీ వంటి కార్యక్రమాలతో చురుగ్గా పనిచేసిన శకుంతల కాలక్రమేణా సంస్థలో పీఎల్జీఏ విభాగంలో కీలక నేతగా ఎదిగినట్లు తెలిపారు. దల్మా జోన్ జోనల్ కమిటీ సభ్యురాలు పని చేశారని బీహర్, జార్ఖండ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన పలు భారీ హింసాత్మక ఘటనలు ఈమె కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. నిజానికి శంకుతల ఫిబ్రవరిలోనే లొంగిపోవాలని ఆమె నిర్ణయించుకున్నారని కానీ ఇవాళ సరెండర్ అయినట్లు చెప్పారు.

సాయుధ పోరాటం అనవసరం:

లొంగుబాటు అనంతరం శకుంతల మీడియాతో మాట్లాడుతూ.. అడవుల్లో ఉండి ఇంకా సాయుధ పోరాటాన్ని నమ్ముకున్న తోటి మావోయిస్ట్ సభ్యులకు శకుంతల ఒక కీలక సందేశాన్ని ఇచ్చారు. హింస, ఆయుధాల వల్ల ఎలాంటి భవిష్యత్తు ఉండదని, తుపాకీ పట్టుకోవడం కంటే ప్రశాంతమైన జీవితం గడపడం మిన్న అని హితవు పలికారు. వారంతా తక్షణమే ఆయుధాలు వీడి పోలీసులకు లొంగిపోయి, సమాజ ప్రధాన స్రవంతిలో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో ఈ సాయుధ పోరాటానికి భవిష్యత్ లేదన్నారు. అయితే శకుంతల లొంగుబాటుతో జంగల్‌మహల్ సరిహద్దు ప్రాంతాల్లో మిగిలి ఉన్న మావోయిస్టు నెట్‌వర్క్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, ఈమెను చూసి మిగిలిన క్యాడర్లు కూడా లొంగిపోతారని ఆశిస్తున్నట్లు కోల్‌కతా ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story