రోడ్డు పనులు ఇంకెప్పుడు..?

by Batti.Sumithra |

గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా ఉన్న సంగారెడ్డిలో కొన్ని అంతర్గత రోడ్లు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఎన్నో సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రోడ్డు పనులు ఇంకెప్పుడు..?
X

దిశ, సంగారెడ్డి : గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా ఉన్న సంగారెడ్డిలో కొన్ని అంతర్గత రోడ్లు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఎన్నో సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అభివృద్ధిలో కీలకంగా మారే 40 ఫీట్ల రోడ్డు నిర్మాణం ఇంకా అమలుకు నోచుకోకపోవడంతో స్థానికులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 37వ వార్డు పరిధిలో రుక్మిణి థియేటర్ రోడ్డు నుంచి డీఐసీ కార్యాలయం లోపలి భాగం గుండా వెళ్లే 40 ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్‌లో ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు భౌతిక రూపం దాల్చకపోవడం పట్ల స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోడ్డు నేరుగా సంగారెడ్డి బైపాస్ రోడ్డుకు అనుసంధానం అయ్యే అవకాశం ఉండటంతో, పట్టణ రవాణా వ్యవస్థకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వీరభద్ర నగర్ కాలనీ, పరిసర కాలనీలతో పాటు మరో మూడు కాలనీల ప్రజలకు ఈ రోడ్డు ద్వారా ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడతాయని వారు చెబుతున్నారు.

నాలుగు కాలనీలకు ఊరట..

ఈ 40 ఫీట్ల రోడ్డు నిర్మాణం పూర్తయితే బైపాస్ రోడ్డుకు చేరుకోవడం మరింత సులభమవుతుందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం బైపాస్ చేరుకోవడానికి చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, ఈ లింక్ రోడ్డు అందుబాటులోకి వస్తే ఆదా కావడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే హెచ్‌ఎండీఏ, మున్సిపల్ అధికారులు పరస్పర సమన్వయంతో ముందుకు వచ్చి మాస్టర్ ప్లాన్‌లో ఉన్న ఈ రహదారి అమలుకు చర్యలు చేపట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story