- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షాలు, వరద ముంపు సమస్యలపై అధికారులు అలర్ట్
వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నతాధికారుల బృందం విస్తృత తనిఖీలు చేసింది.

దిశ, మేడ్చల్ బ్యూరో; నగరంలో వర్షాలు, వరద ముంపు సమస్యలపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షాకాలం నేపథ్యంలో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలోకి దిగారు. ఇందులో భాగంగా బుధవారం నగరంలోని పలు వరద ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల ఉన్నత స్థాయి బృందం బుధవారం విస్తృతంగా పర్యటించింది. బేగంపేటలోని చీకోటి గార్డెన్స్, ప్రకాష్ నగర్ పరిసర ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించిన అధికారులు, అక్కడ ఏర్పాటు చేసిన వాటర్ లాగింగ్ పాయింట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ పర్యటనలో డీజీపీ సి.వి. ఆనంద్, హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి, జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ అశోక్ రెడ్డి, జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బేగంపేటలో తనిఖీల అనంతరం ఈ బృందం ఉప్పల్ జంక్షన్ వద్ద నీటి నిల్వ సమస్యలను, ఎల్.బి.నగర్ ఎక్స్ రోడ్స్ పరిసరాల్లో వర్షపు నీటి ప్రవాహ పరిస్థితులను నిశితంగా పరిశీలించింది. అలాగే వనస్థలిపురంలోని కేఎల్‌ఎమ్ మాల్ సమీపంలో ఉన్న ముంపు ప్రాంతాన్ని కూడా అధికారులు సందర్శించి స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
యుద్ధ ప్రాతిపదికన చేపట్టండి..
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిన పూడిక, చెత్తాచెదారాన్ని జీహెచ్‌ఎంసీ, జలమండలి సిబ్బంది యుద్ధప్రాతిపదికన వెంటనే తొలగించాలని ఆదేశించారు. ముంపు సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కడికక్కడ నీరు నిలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నగరంలోని ప్రధాన చెరువుల ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లతో పాటు నాలాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. నగరంలో ఏళ్ల తరబడి వేధిస్తున్న వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనేలా తదుపరి చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
సమన్వయంతో పని చేద్దాం..
రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, నగరవాసులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. జలమండలి, హైడ్రా, మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్, రెవెన్యూ వంటి కీలక శాఖలన్నీ పరస్పర సమన్వయంతో విధులను నిర్వహిస్తూ పని చేద్దామని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ముంపు ముప్పు ఎక్కువగా ఉన్న లోతట్టు ప్రాంతాల్లో 24 గంటల పాటు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.






